డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యం కావాలి
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ● మిరుదొడ్డిలో 2కే రన్
మిరుదొడ్డి(దుబ్బాక): డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2కే చేపట్టారు. యువత, చిన్నారులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై కళాకారుడు పద్మనాభుని పల్లి శ్రీనివాస్, భార్గవి రచించి గానం చేసిన ‘గంజాయి అంటే మాకు తెలవదు బిడ్డా’ అనే సీడీని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్‌ఎస్ నాయకుడు బొంపెల్లి మనోహర్‌రావు, రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజర్ తోట కమలాకర్‌రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత జీవితాలను చిన్నాభిన్నం చేసే గంజాయి, డైజోఫామ్, అల్ఫాజోం వంటి మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు. పిల్లలపై పర్యవేక్షణ లేకపోతే వ్యసనాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటారని అన్నారు. పోలీస్ యంత్రాంగం మత్తు పదార్థాల రవాణాపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి, డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడానికి కఠినంగా వ్యవహరించాలన్నారు. 2కే రన్‌లో విన్నర్లుగా నిలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాపురెడ్డి, నునిగాని రాజు, ప్రముఖ న్యాయవాది సత్యనారాయణ, బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment