అప్‌గ్రేడ్ దిశగా మార్కెట్ కమిటీలు
● గజ్వేల్, చేర్యాలతోపాటు హుస్నాబాద్‌కు అర్హతలు ● స్పెషల్ గ్రేడ్ హోదా దక్కే అవకాశం
జిల్లాలోని మార్కెట్ కమిటీలు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సిద్దిపేట మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం గ్రేడ్–1 మార్కెట్ కమిటీలుగా కొనసాగుతున్న గజ్వేల్, చేర్యాలతోపాటు గ్రేడ్–2 మార్కెట్ కమిటీగా ఉన్న హుస్నాబాద్ సైతం స్పెషల్ గ్రేడ్ హోదాకు సంబంధించిన అర్హతలు సాధించింది. ప్రతి మార్కెట్ ఏటా రూ.3.5కోట్ల వరకు ఆదాయం సాధిస్తుండటంతో హోదా పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
గజ్వేల్: జిల్లాలో 14 మార్కెట్ కమీటీలు ఉన్నాయి. వీటికి వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, శనగలు, పెసర్లు, వేరుశనగ, కూరగాయలు తదితర ఉత్ప త్తుల ద్వారా మార్కెట్ ఫీజురూపంలో ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వ సంస్థలు, వ్యాపారులు తమ చేసిన క్రయవిక్రయాల్లో 2శాతం మార్కెట్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఉత్పత్తుల విక్రయాలపై వచ్చే మార్కెట్ ఫీజు, చెక్‌పోస్టులు, దుకాణాల ఆద్దెలు, ఇతర వనరులతోపాటు ప్రైవేటులో మక్కలు, కందులు, శనగలు, పెసర్లు తదితరాల కొనుగోళ్లు జరిగితే ఆదాయం సమకూరుతుంది. ఈ క్రమంలోనే ఆయా మార్కెట్ కమిటీలు ఏటా తమ ఆదాయాన్ని పెంచుకొంటూపోతున్నాయి.
ఆదాయం తీరు ఇది...
సిద్దిపేట మార్కెట్ కమిటీకి గతేడాది రూ.3.66కోట్లకుపైనే ఆదాయం సమకూరింది. గజ్వేల్‌కు రూ.3.46కోట్లు, చిన్నకోడూరుకు రూ.1.62కోట్లు, నంగునూరుకు రూ.8.41కోట్లు, తొగుటకు రూ.35.08లక్షల ఆదాయం వచ్చింది. అలాగే దౌల్తాబాద్‌కు రూ.86.89లక్షలు, కొండపాకకు రూ.73లక్షలు, మిర్‌దొడ్డికి రూ.58.27లక్షలు, దుబ్బాకకు రూ.1.96కోట్లు, బెజ్జంకికి రూ.2.68కోట్లు, హుస్నాబాద్‌కు రూ.4.03కోట్లు, కోహెడకు రూ.1.12కోట్లు, చేర్యాలకు రూ.3.58కోట్లు, వంటిమామిడికి రూ.1.73కోట్ల ఆదాయం సమకూరింది. ఈ లెక్కన గతేడాది అన్ని మార్కెట్ కమిటీలు కలుపుకొని రూ.271కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. ఈసారి 2024–25 మార్చి వరకు (ఫైనాన్సియల్ ఇయర్) గానూ రూ.350కోట్ల ఆదాయం రాబట్టాలని ఆయా మార్కెట్ కమిటీలకు మార్కెటింగ్ శాఖ టార్గెట్ విధించింది. ఇందులో ఇప్పటివరకు రూ.268కోట్ల ఆదాయం సమకూరింది.
గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్‌లలో గణనీయంగా ఆదాయం పెరుగుదల
ఆదాయాన్ని పెంచుకోవడంలో ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్ మార్కెట్ కమిటీగా ఉన్న సిద్దిపేటతో గ్రేడ్ వన్‌గా ఉన్న గజ్వేల్, చేర్యాలతోపాటు గ్రేడ్–2 ఉన్న హుస్నాబాద్ మార్కెట్‌లు పోటీ పడుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ మూడు మార్కెట్ కమిటీలు గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాయి. గజ్వేల్‌కు ఈ ఏడాది రూ.4.78కోట్ల ఆదాయం లక్ష్యంగా ఉండగా ఇప్పటివరకు రూ.2.55కోట్ల ఆదాయం సమకూరింది. అదేవిధంగా చేర్యాలకు రూ.3.96కోట్లు టార్గెట్‌గా ఉండగా ఇప్పటివరకు రూ.4.27కోట్ల ఆదాయం వచ్చింది. హుస్నాబాద్‌కు రూ.4.85కోట్ల ఆదాయం లక్ష్యంగా ఉండగా...3.31కోట్ల ఆదాయం వచ్చేసింది. మంచి ఫలితాలను సాధిస్తున్న ఈ మార్కెట్ కమిటీలను అప్‌గ్రేడ్ చేసే అంశం త్వరలోనే కార్యాచరణలోకి రానుందని మార్కెటింగ్ శాఖలో చర్చజరుగుతున్నది. ఇలా జరిగితే మూడు మార్కెట్ కమిటీల స్వరూపం మారనున్నది. ఆయా మార్కెట్ కమిటీల్లో సిబ్బంది సంఖ్య, సౌకర్యాలు పెరిగి...రైతులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. ఈ అంశంపై జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజును వివరణ కోరగా...అప్‌గ్రేడ్ సంబంధించిన అంశం ఉన్నతాధికారుల పరిధిలో ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment