ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ! | Sakshi
Sakshi News home page

ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!

Published Fri, May 24 2024 5:58 PM

Ambati Rayudu Another Dig At RCB  Virat Kohli Gets Backslash Fans Trolls

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ విరాట్‌ కోహ్లి అభిమానులు మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడుపై మండిపడుతున్నారు. కోహ్లిపై విద్వేష విషం చిమ్మటం ఇకనైనా మానుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు.

కాగా ఐపీఎల్‌-2024లో ప్లే ఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించిన విషయం తెలిసిందే. సీజన్‌ ఆరంభం నుంచి వరుస ఓటముల పాలైనా.. తర్వాత తిరిగి పుంజుకుని అనూహ్య రీతిలో కమ్‌బ్యాక్‌ ఇచ్చింది ఆర్సీబీ. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి.. టాప్‌-4 బెర్తును ఖరారు చేసుకునే క్రమంలో సీఎస్‌కేను చిత్తు చేసింది.

అంబరాన్నంటిన సంబరాలు
ఈ క్రమంలో కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానులు సైతం పెద్ద ఎత్తున సెలబ్రేట్‌ చేసుకున్నారు. కేవలం భారత్‌లోనే కాకుండా అమెరికాలోనూ ఆర్సీబీ విక్టరీని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. సీఎస్‌కేను విమర్శిస్తూ సోషల్‌ మీడియాలోనూ పోస్టులు పెట్టారు.

ఈ నేపథ్యంలో సీఎస్‌కే మాజీ బ్యాటర్‌ అంబటి రాయుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. అందులో చెన్నై ఆటగాళ్లు ఐదు అంటూ తాము ఐదుసార్లు ట్రోఫీ గెలిచామన్నట్లుగా సంతోషం వ్యక్తం చేశారు. ఈ వీడియోకు..

సీఎస్‌కేను ఓడిస్తే ట్రోఫీ గెలిచినట్లేనా?
‘‘ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన జట్టు నుంచి మీకొక రిమైండర్‌’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌కు మండిపోయింది. ఇక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఆర్సీబీ ఓడిపోగానే రాయుడు మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. 

‘‘కేవలం ప్లే ఆఫ్స్‌ చేరినంత మాత్రాన.. సెలబ్రేషన్స్‌ విషయంలో రెచ్చిపోతే ఎవరూ టైటిల్‌ గెలవరు. కేవలం సీఎస్‌కేను ఓడిస్తే ట్రోఫీ గెలిచినట్లే అని భావించకూడదు’’ అని మరోసారి పుండు మీద కారం చల్లాడు.

ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కోహ్లి ఫ్యాన్స్‌ అంబటి రాయుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 వరల్డ్‌కప్‌నకు ఎంపిక కాని కారణంగా ఇప్పుడు ఇలా కోహ్లిని, అతడి టీమ్‌ను టార్గెట్‌ చేస్తున్నాడంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు.

మరోసారి కోహ్లి ఫ్యాన్స్‌తో పెట్టుకున్న రాయుడు
అయినప్పటికీ అంబటి రాయుడు వెనక్కి తగ్గలేదు. మరోసారి కోహ్లి ఫ్యాన్స్‌తో పెట్టుకుని చివాట్లు తింటున్నాడు. తాజాగా.. ‘‘ఆర్సీబీకి మద్దతుగా ఏళ్లకు ఏళ్లుగా ఆ జట్టుతోనే ఉన్న అభిమానులను చూసి నా గుండె తరుక్కుపోతోంది.

మేనేజ్‌మెంట్‌, కెప్టెన్లు కేవలం వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించకుండా.. జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించి ఉంటే ఇప్పటికే ఆర్సీబీ ఎన్నోసార్లు టైటిళ్లు గెలిచేది.

ఇప్పటికైనా జట్టు ప్రయోజనాలను ప్రథమ ప్రాధాన్యంగా భావించే ఆటగాళ్లను తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి తీసుకురండి. అలా అయితే మెగా వేలం నుంచే సరికొత్త అధ్యాయం మొదలవుతుంది’’ అని అంబటి రాయుడు కోహ్లి, ఆర్సీబీ ఫ్యాన్స్‌పై ఎక్స్‌ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించాడు.

కామెంట్లతో ఉతికి ఆరేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్‌
ఇందుకు స్పందించిన కింగ్‌ కోహ్లి ఫ్యాన్స్‌ మరోసారి ట్రోలింగ్‌కు దిగారు. ‘‘61 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మీరు.. 80 ఇంటర్నేషనల్‌ సెంచరీలు సాధించిన కోహ్లి గురించి ఇలా మాట్లాడటం అస్సలు బాగాలేదు సర్‌!.. 

ఒక్కసారి ఐపీఎల్‌ను పక్కన పెడితే మీ కెరీర్‌లో మీరేం సాధించారో చెప్పండి. కోహ్లి 2011 వరల్డ్‌కప్‌ జట్టులో సభ్యుడు. టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో విజయాలు సాధించాడు. రిటైర్మెంట్‌పై యూటర్నులు తీసుకోవడం తప్ప మీరేం చేశారు?’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.

చదవండి: నేనైతే వదిలేసేదాన్నేమో: దినేశ్‌ కార్తిక్‌ భార్య దీపిక భావోద్వేగం

Advertisement
 
Advertisement
 
Advertisement