జస్‌ప్రీత్ బుమ్రా
Jasprit Bumrah Returns As Captain IND Vs IRE T20 Series: సుదీర్ఘ విరామం తర్వాత భారత స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ మైదానంలోకి దిగబోతున్నాడు. వెన్నుకు గాయంతో జట్టుకు దూరం కావడం, ఆపై శస్త్రచికిత్స, అనంతరం రీహాబిలిటేషన్... ఇప్పుడు పూర్తిగా కోలుకొని బుమ్రా ఆట కోసం సిద్ధమయ్యాడు. ఐర్లాండ్‌తో జరిగే 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు.
కెప్టెన్‌గా రీఎంట్రీ
పైగా అతను ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఒక టెస్టులో బుమ్రా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కీలకమైన ఆసియా కప్, ప్రపంచకప్‌కు ముందు బుమ్రా మ్యాచ్ ఫిట్‌నెస్ స్థాయిని పరీక్షించేందుకు పెద్దగా ఒత్తిడి లేని, బలహీన జట్టుతో జరిగే సిరీస్‌లో ఆడించబోతున్నారు.
ప్రయోగాలు అవసరమా?
ఈ నేపథ్యంలో ఓవైపు.. టీమిండియా అభిమానులు బుమ్రా రాకపై హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు.. వన్డే ప్రపంచకప్-2023 లాంటి మెగా ఈవెంట్‌కు ముందు కెప్టెన్సీతో ప్రయోగాలు ఎందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐర్లాండ్ బలహీన జట్టే కావొచ్చు.. కానీ దాదాపు ఏడాది తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న బుమ్రాపై అదనపు భారం మోపడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
అదనపు భారమే
సారథిగా జట్టును ముందుండి నడిపించడం అంత తేలికేమీ కాదని.. ఆన్ ఫీల్డ్‌లోనే కాకుండా ఆఫ్ ఫీల్డ్‌లోనూ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. ప్రధాన పేసర్ అయిన బుమ్రా... మెగా ఈవెంట్‌కు ముందు బౌలింగ్‌పై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
రిస్క్ ఎందుకు?
ఫిట్‌నెస్, ఫామ్‌ను పరీక్షించడానికే ఐర్లాండ్ సిరీస్‌ను ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుంటున్నప్పటికీ.. ఇప్పుడే మళ్లీ అతడిని రిస్క్‌లోకి నెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గతేడాది.. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టును ఓడించినంత పని చేసిన ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. గాయాల బెడదతో సతమతమైన బుమ్రా విషయంలో.. ఏమాత్రం తేడా వచ్చినా ఆసియా కప్, ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతా యువ ఆటగాళ్లే!
కాగా చివరిసారిగా గత ఏడాది సెప్టెంబరు 22న హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన బుమ్రా... ఐపీఎల్-2023 కూడా ఆడలేదు. ఇదిలా ఉంటే.. బుమ్రాతో పాటు గాయం నుంచి కోలుకున్న మరో పేసర్ ప్రసిధ్ కృష్ణకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.
ఇక ప్రసిధ్ కూడా సంవత్సరం క్రితం భారత్‌కు ఆడాడు. వీరిద్దరు మినహా సీనియర్ ఆటగాళ్లెవరూ లేకుండా యువ ఆటగాళ్లతోనే మిగతా జట్టును ఎంపిక చేశారు. ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన టీమ్‌లోని సభ్యులే దాదాపుగా ఇక్కడా ఉన్నారు. టీమిండియా- ఐర్లాండ్ మధ్య ఆగస్టు 18, 20, 23 తేదీల్లో డబ్లిన్‌లో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు వివరాలు:
బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్.
చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్‌కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment