కొవ్వు పేరుకుపోయింది: బాబర్‌పై మండిపడ్డ హఫీజ్‌ | Couldnt Complete 2KM Run: Hafeez Blames Babar For Team Poor Fitness Level | Sakshi
Sakshi News home page

వారి శరీరాల్లో కొవ్వు పేరుకుపోయింది: బాబర్‌పై మండిపడ్డ హఫీజ్‌

Published Wed, Feb 21 2024 12:54 PM | Last Updated on Wed, Feb 21 2024 1:23 PM

Couldnt Complete 2KM Run: Hafeez Blames Babar For Team Poor Fitness Level - Sakshi

When the fat levels Checked Skin fold of all of them was high: పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బ్యాటర్‌ బాబర్‌ ఆజం తీరును హెడ్‌కోచ్‌ మహ్మద్‌ హఫీజ్‌ విమర్శించాడు. మాజీ కోచ్‌ మిక్కీ ఆర్థర్‌తో కలిసి జట్టును భ్రష్టుపట్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు క్రమశిక్షణ లేకుండా తయారు కావడానికి బాబర్‌, మిక్కీ కారణమని హఫీజ్‌ మండిపడ్డాడు.

వరల్డ్‌కప్‌లో వైఫల్యం
కాగా మిక్కీ ఆర్థర్‌ మార్గదర్శనంలో బాబర్‌ ఆజం కెప్టెన్సీలో పాకిస్తాన్‌ జట్టు వన్డే వరల్డ్‌కప్‌-2023లో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. భారత్‌ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్లో కనీసం సెమీస్‌ కూడా చేరుకుండానే నిష్క్రమించింది.

ఈ నేపథ్యంలో బాబర్‌ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. హెడ్‌కోచ్‌ మిక్కీ ఆర్థర్‌పై వేటు పడింది. ఈ క్రమంలో మహ్మద్‌ హఫీజ్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. అంతేకాదు హెడ్‌కోచ్‌ బాధ్యతలనూ తానే చేపట్టాడు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో చేదు అనుభవం
ఇక బాబర్‌ స్థానంలో టెస్టులకు షాన్‌ మసూద్‌, టీ20లకు షాహిన్‌ ఆఫ్రిది సారథులుగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో కొత్త నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాక్‌.. న్యూజిలాండ్‌ టూర్‌లో టీ20 సిరీస్‌ను కోల్పోయింది.

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో తనకు ఓ విచిత్రమైన విషయం తెలిసిందంటూ మహ్మద్‌ హఫీజ్‌ తాజాగా వెల్లడించాడు. బాబర్‌ ఆజం, మిక్కీ ఆర్థర్‌ కలిసి ఫిట్‌నెస్‌ విలువలు గాలికొదిలేసిన తీరు తెలిసి ఆశ్చర్యపోయానన్నాడు.

ఈ మేరకు.. ‘‘ఆస్ట్రేలియాకు వెళ్లినపుడు ఫిట్‌నెస్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆటగాళ్లకు చెప్పాను. ట్రైనర్‌తో కూడా ఇదే మాట అన్నాడు. కానీ అప్పుడతడు నాకో షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు. ఆర్నెళ్ల క్రితం అప్పటి కెప్టెన్‌, డైరెక్టర్‌.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ లెవల్స్‌ చెక్‌ చేయొద్దని చెప్పారన్నాడు.

వారి శరీరాల్లో కొవ్వు పేరుకుపోయింది
ఆటగాళ్లను స్వేచ్ఛగా వదిలేయాలని వాళ్లిద్దరు తనను ఆదేశించారన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ లెవల్స్‌ చెక్‌ చేయిస్తే.. ఉండాల్సిన దాని కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ కొవ్వు వారి శరీరాల్లో పేరుకుపోయినట్లు తెలిసింది.

చాలా మంది అన్‌ఫిట్‌గా ఉన్నారు. కొంతమంది కనీసం 2 కిలోమీటర్ల ట్రయల్‌ రన్‌ కూడా పూర్తిచేయలేకపోయారు. ఆర్నెళ్ల క్రితం వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని నేను తారుమారు చేశాను. ఫిట్‌గా లేకుంటే ఓడిపోతూనే ఉంటారని ఆటగాళ్లను హెచ్చరించాను’’ అని మహ్మద్‌ హఫీజ్‌ ‘ఏ’ స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. కాగా ప్రస్తుతం పాక్‌ ప్రధాన ఆటగాళ్లంతా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌తో బిజీగా ఉన్నారు.

చదవండి: Ind Vs Eng 4th Test: బుమ్రాను రిలీజ్‌ చేసిన బీసీసీఐ.. అతడికి గ్రీన్‌ సిగ్నల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement