CWC 2023 IND VS AUS: విరాట్‌ టెస్ట్‌ క్రికెట్‌లా ఆడమన్నాడు: కేఎల్‌ రాహుల్‌ | CWC 2023 IND VS AUS: KL Rahul Comments After Victory | Sakshi
Sakshi News home page

CWC 2023 IND VS AUS: విరాట్‌ టెస్ట్‌ క్రికెట్‌లా ఆడమన్నాడు: కేఎల్‌ రాహుల్‌

Published Mon, Oct 9 2023 8:28 AM | Last Updated on Mon, Oct 9 2023 9:30 AM

CWC 2023 IND VS AUS: KL Rahul Comments After Victory - Sakshi

చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ (115 బంతుల్లో 97 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శన కారణంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న రాహుల్‌ ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా మ్యాచ్‌కు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్నాడు. 

2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్‌లో రావడంపై స్పందిస్తూ.. వాస్తవానికి ఎలాంటి ఆలోచన లేదు, ఆసీస్‌ను స్వల్ప స్కోర్‌కు పరిమితం చేయడంతో బాగా స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటానని అనుకున్నాను. అయితే పిచ్‌ నుంచి పేసర్లకు సహకారం లభించడంతో మేము స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయాం. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన నాకు పిచ్‌లో ఏదో ఉందని అర్ధమైంది. అప్పటికే క్రీజ్‌లో ఉన్న విరాట్‌ కాసేపు నన్ను టెస్ట్‌ క్రికెట్‌లా ఆడమని అన్నాడు. 

పిచ్‌పై కొత్త బంతితో పేసర్లకు, ఆ తర్వాత స్పిన్నర్లకు సహకారం లభించింది. చివరి 15-20 ఓవర్లలో మంచు కీలకపాత్ర పోషించింది. బంతి బాగా స్కిడ్‌ అయ్యింది. ఇది ఓ రకంగా మాకు సాయపడింది. మొత్తంగా ఈ పిచ్‌ రెండు షేడ్స్‌ కలిగి ఉంది. బ్యాటింగ్‌ చేసేందుకు అంత సులవైన వికెట్‌ కాదు.. అలాగనీ మరీ ఫ్లాట్‌ వికెట్‌ కూడా కాదు. ఓ మంచి క్రికెట్‌ వికెట్‌ అని చెప్పగలను. కొంత బౌలర్లకు, కొంత బ్యాటర్లకు అనుకూలమైనది. ఇలాంటి పిచ్‌లు సౌత్‌ ఇండియాలో మాత్రమే ఉంటాయి. చెన్నై పిచ్‌ ఇందులో ప్రత్యేకం.

కాగా, రాహుల్‌తో పాటు కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో టీమిండియా ఆసీస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. బుమ్రా (10-0-35-2), రవీంద్ర జడేజా (10-2-28-3), కుల్దీప్‌ యాదవ్‌ (10-0-42-2), అశ్విన్‌ (10-1-34-1), సిరాజ్‌ (6.3-1-26-1), హార్దిక్‌ (3-0-28-1) ధాటికి 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్‌ కాగా.. కోహ్లి, రాహుల్‌ల చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ల సాయంతో భారత్‌ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక విజయం సాధించింది.

ఆసీస్‌ బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 3, స్టార్క్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌, ఇషాన్‌లతో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ డకౌట్లయ్యారు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో (అక్టోబర్‌ 11) న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement