CWC 2023: జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి, రాహుల్‌..! | CWC 2023 IND VS AUS: Kohli And Rahul Played Life Time Innings, Fans Reacts | Sakshi
Sakshi News home page

CWC 2023 IND VS AUS: జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి, రాహుల్‌..!

Published Mon, Oct 9 2023 7:36 AM | Last Updated on Mon, Oct 9 2023 9:26 AM

CWC 2023 IND VS AUS: Kohli And Rahul Played Life Time Innings, Fans Reacts - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా నిన్న (అక్టోబర్‌ 8) జరిగిన భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌ను భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. 200 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో 2 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌ను విరాట్‌ కోహ్లి-కేఎల్‌ రాహుల్‌ గట్టెక్కించిన తీరు సగటు భారత క్రికెట్‌ అభిమానికి జీవితకాలం గుర్తుండిపోతుంది. ఆఖర్లో కోహ్లి ఔటైనా.. రాహుల్‌ జట్టును విజయతీరాలకు చేర్చిన విధానం టీమిండియా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో రాహుల్‌ తన వ్యతిరేకులను కూడా తనవైపు మళ్లించకున్నాడు. కోహ్లి తన ఖ్యాతిని మరింత పెంచుకుని అందరికీ ఫేవరెట్‌ భడ్డీగా మారాడు. కోహ్లి, రాహుల్‌లు తమ జీవితకాలాల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడారని ఫ్యాన్స్‌ కొనియాడుతున్నారు. ముఖ్యంగా రాహుల్‌పై అభిమానులు ఓ రేంజ్‌లో ప్రశంసల వర్షం కురిస్తున్నారు. రాహుల్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క టెక్నికల్‌ మిస్టేక్‌ కూడా లేదని కొనియాడుతున్నారు.

మిచెల్‌ మార్ష్‌ క్యాచ్‌ డ్రాప్‌ చేయడంతో కోహ్లికి లైఫ్‌ దొరికింది.. రాహుల్‌ అయితే ప్రత్యర్థికి కనీసం ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఇన్నింగ్స్‌ను నిర్మించాడని ఆకాశానికెత్తుతున్నారు. క్లిష్టమైన పిచ్‌పై, తీవ్రమైన ఒత్తిడిలో విరాట్‌-రాహుల్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తీరు అమోఘమని ప్రశంసిస్తున్నారు. నిన్నటి నుంచి కోహ్లి, రాహుల్‌ నామస్మరణతో సోషల్‌మీడియా హోరెత్తిపోతుంది. పనిలోపనిగా జనాలు రోహిత్‌, ఇషాన్‌ కిషన్‌లపై విరుచుకుపడుతున్నారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇలానా అడేదని మండిపడుతున్నారు. ఆసీస్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసిన భారత బౌలర్ల కృషిని అభినందిస్తున్నారు. మొత్తంగా టీమిండియాపై ప్రశంసల వర్షంతో సోషల్‌మీడియా తడిసి ముద్దైపోతుంది.

కాగా, నిన్న ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. బుమ్రా (10-0-35-2), రవీంద్ర జడేజా (10-2-28-3), కుల్దీప్‌ యాదవ్‌ (10-0-42-2), అశ్విన్‌ (10-1-34-1), సిరాజ్‌ (6.3-1-26-1), హార్దిక్‌ (3-0-28-1) ధాటికి 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. 

స్వల్ప లక్ష్య ఛేదనలో కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు), రాహుల్‌ (115 బంతుల్లో 97 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ల సాయంతో భారత్‌ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక విజయం సాధించింది. ఆసీస్‌ బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 3, స్టార్క్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌, ఇషాన్‌లతో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ డకౌట్లయ్యారు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో (అక్టోబర్‌ 11) ఆఫ్ఘనిస్తాన్‌తో (న్యూఢిల్లీ వేదికగా) తలపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement