కల్లెడ నుంచి ‘పారిస్‌’ దాకా... మా దీప్తి ’బంగారం’! | Deepthi got Third position in womens 400m T20 category | Sakshi
Sakshi News home page

కల్లెడ నుంచి ‘పారిస్‌’ దాకా... మా దీప్తి ’బంగారం’!

Published Wed, Sep 4 2024 2:39 AM | Last Updated on Wed, Sep 4 2024 9:21 AM

Deepthi got Third position in womens 400m T20 category

మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో మూడో స్థానం

పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి తెలంగాణ ప్లేయర్‌గా ఘనత

పారాలింపిక్స్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. సోమవారం ఏకంగా ఎనిమిది పతకాలతో భారత క్రీడాకారులు అదరగొట్టగా... మంగళవారం కాంస్యం రూపంలో ఒక పతకం లభించింది. మహిళల అథ్లెటిక్స్‌ 400 మీటర్ల టి20 రేసులో  భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజి కాంస్య పతకం సాధించింది. 

ప్రపంచ పారా చాంపియన్, పారా ఆసియా గేమ్స్‌ చాంపియన్‌ హోదాలో తొలిసారి పారాలింపిక్స్‌లో అడుగుపెట్టిన దీప్తి మూడో స్థానాన్ని సంపాదించింది. దీప్తి కాంస్యంతో పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరుకుంది. 

మరిన్ని మెడల్‌ ఈవెంట్స్‌లో మన క్రీడాకారులు పోటీపడాల్సి ఉండటంతో ఈసారి భారత్‌ పతకాల సంఖ్య 20 దాటే అవకాశముంది. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో  భారత్‌ 19 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.  

పారిస్‌: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో 16వ పతకం చేరింది. మంగళవారం జరిగిన మహిళల అథ్లెటిక్స్‌ 400 మీటర్ల టి20 కేటగిరి ఫైనల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అథ్లెట్‌ దీప్తి జివాంజి కాంస్య పతకాన్ని సాధించింది. ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో 20 ఏళ్ల దీప్తి 55.82 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. 

యూలియా షులియర్‌ (ఉక్రెయిన్‌; 55.16 సెకన్లు) స్వర్ణం సంపాదించగా... టర్కీ అథ్లెట్‌ ఐసెల్‌ ఒండెర్‌ (55.23 సెకన్ల) రజత పతకాన్ని గెల్చుకుంది. ఈ ఏడాది మేలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌íÙప్‌లో 55.07 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకం నెగ్గిన దీప్తి అదే ప్రదర్శనను ‘పారిస్‌’లో పునరావృతం చేయలేకపోయింది. ఒకవేళ ఇదే టైమింగ్‌ను దీప్తి ‘పారిస్‌’లో నమోదు చేసి ఉంటే ఆమెకు స్వర్ణ పతకం లభించేది. 

ఫైనల్‌ రేసు ఆరంభంలో చివరి వరకు  రెండో స్థానంలో ఉన్న దీప్తి ఆఖరి పది మీటర్లలో వెనుకబడిపోయి మూడో స్థానంలో నిలిచింది. సోమవారం రాత్రి జరిగిన హీట్స్‌లో 54.96 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన టర్కీ అథ్లెట్‌ ఐసెల్‌ ఒండెర్‌ చివరి పది మీటర్లలో వేగంగా పరుగెత్తి దీప్తిని దాటేసి రజత పతకాన్ని ఖరారు చేసుకుంది. 

సోమవారం అర్ధరాత్రి తర్వాత ముగిసిన మహిళల బ్యాడ్మింటన్‌ ఎస్‌హెచ్‌6 సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారిణి నిత్యశ్రీ శివన్‌ కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో నిత్యశ్రీ 21–14, 21–6తో రీనా మార్లిన్‌ (ఇండోనేసియా)పై గెలిచింది. మహిళల షాట్‌పుట్‌ ఎఫ్‌34 కేటగిరీలో భారత అథ్లెట్‌ భాగ్యశ్రీ జాధవ్‌ ఇనుప గుండును 7.28 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.  

అవనికి ఐదో స్థానం 
తన పారాలింపిక్స్‌ కెరీర్‌లో మూడో పతకం సాధించాలని ఆశించిన భారత మహిళా షూటర్‌ అవని లేఖరాకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఎస్‌హెచ్‌1 ఈవెంట్‌ ఫైనల్లో 22 ఏళ్ల అవని ఐదో స్థానంలో నిలిచింది. 

ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అవని 420.6 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో అవని 1159 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.  

ముగిసిన పూజ పోరు 
మహిళల ఆర్చరీ రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్‌ పూజ పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో పూజ 4–6 (28–23, 25–24, 27–28, 24–27, 24–27)తో వు చున్‌యాన్‌ (చైనా) చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండు సెట్‌లు గెలిచిన పూజ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో సెట్‌లో స్కోరును సమం చేసినా పూజ సెమీఫైనల్‌కు చేరుకునేది. కానీ పూజ తడబడి మూడు సెట్‌లను కోల్పోయి ఓటమి పాలైంది. తొలి రౌండ్‌లో పూజ 6–0 (27–24, 26–22, 272–6)తో యాగ్ముర్‌ (టరీ్క)పై నెగ్గింది.

కల్లెడ నుంచి ‘పారిస్‌’ దాకా...
పారా అథ్లెటిక్స్‌లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న క్రీడాకారులు ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్‌. దీప్తి స్వస్థలం వరంగల్‌ జిల్లా లోని కల్లెడ గ్రామం. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఇబ్బంది పెడుతుండగా... మరోవైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా గ్రామంలో హేళన చేసేవారు. ఇలాంటి తరుణంలో భారత అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. 

ఒక స్కూల్‌ టోర్నీలో దీప్తి రన్నింగ్‌ ప్రతిభ గురించి తన స్నేహితుడి ద్వారా రమేశ్‌కు తెలిసింది. దాంతో రమేశ్‌ ఆ అమ్మాయిని హైదరాబాద్‌కు రప్పించి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా శిక్షణా కేంద్రంలో ట్రెయినింగ్‌ అందించే ఏర్పాట్లు చేశారు. మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో దీప్తికి శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్‌ హెడ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కూడా ‘మైత్రా ఫౌండేషన్‌’తో కలిసి దీప్తికి ఆర్థికంగా సహకారం అందించారు. 

కెరీర్‌ ఆరంభంలో దీప్తి అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్‌ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్‌–18 చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2021 సీనియర్‌ నేషనల్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్‌ పోటీల బరిలోకి దిగింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్‌ లభించింది. దాంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్‌లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది. 

ఆర్థిక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ స్వర్ణ ప్రదర్శనతో ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు. ఈ ఏడాది మే నెలలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా చాంపియన్‌షిప్‌లో దీప్తి 55.07 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించి పారాలింపిక్స్‌లో మెడల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ పతకం సాధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement