Ind vs SA 1st Test Rohit Sharma Comments: సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలుస్తామనే నమ్మకం ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. జట్టులో ప్రతి ఒక్కరు కఠిన శ్రమకోరుస్తూ తమ వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. కాగా భారత జట్టుకు సఫారీ దేశంలో టెస్టు సిరీస్ విజయం అందని ద్రాక్షగానే ఉంది. అయితే, ఈసారైనా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాం
కాగా బాక్సింగ్ డే నుంచి సౌతాఫ్రికా- భారత్ మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ‘‘నా దృష్టిలో ఈ సిరీస్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. గతంలో ఏ భారత జట్టూ సాధించని ఘనతను అందుకునేందుకు ఇదో మంచి అవకాశం. గతంలో రెండుసార్లు సిరీస్ గెలిచేందుకు చేరువగా వచ్చినా సాధ్యం కాలేదు. ఈసారి కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇక్కడ అడుగు పెట్టాం.
వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని ఈ టెస్టు సిరీస్‌కు ముడి పెట్టలేం. అయితే ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ఏదో ఒకటి దక్కాలి. షమీ లేకపోవడం లోటే కానీ కొత్త బౌలర్‌కు ఇది మంచి అవకాశం. మ్యాచ్‌కు ముందే మూడో పేసర్‌పై నిర్ణయం తీసుకుంటాం. కీపర్‌గా రాహుల్ రాణిస్తాడనే నమ్ముతున్నాం. అతను ఈసారి మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
త్వరలోనే మీకు సమాధానం లభిస్తుంది
ఇక ఈ సందర్భంగా తన టీ20 భవిష్యత్తు గురించి స్పందిస్తూ.. ‘‘నాకు ఆడేందుకు అవకాశం ఉన్న అన్ని చోట్లా క్రికెట్ ఆడుతూనే ఉంటాం. అందరికీ ఆడాలనే ఉంటుంది. (మీరు ఏం అడుగుతారో నాకు తెలుసు). నా టి20 భవిష్యత్తు గురించి త్వరలోనే మీకు సమాధానం లభిస్తుంది’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్-2022 ముగిసిన తర్వాత హిట్‌మ్యాన్ ఇంత వరకు ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడలేదన్న విషయం తెలిసిందే.
ఐపీఎల్‌లోనైనా అతడి మెరుపులు చూసే అవకాశం వస్తుందని అభిమానులు భావిస్తున్న తరుణంలో ముంబై ఇండియన్స్ ఇటీవలే కీలక ప్రకటన చేసింది. ముంబైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను తమ కెప్టెన్‌గా నియమించింది.
ఈ నేపథ్యంలో రోహిత్.. హార్దిక్ సారథ్యంలో ఆడతాడా? లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడా అన్న అనుమానాల నడుమ హిట్‌మ్యాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఒకవేళ రోహిత్ శర్మ గనుక ఐపీఎల్-2024కు దూరమైతే ఇక ప్రపంచకప్ ఈవెంట్లోనూ ఆడనట్లే!!
Rohit Sharma on T20 World Cup 2024 pic.twitter.com/dxSNqbXxPY
— Awadhesh Mishra (@sportswalaguy) December 25, 2023
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికా-భారత్ టెస్టు సిరీస్.. ఐరెన్ లెగ్ అంపైర్ ఔట్
Comments
Please login to add a commentAdd a comment