ఐపీఎల్‌ 2021: చెన్నైని మట్టికరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌ | IPL 2021: Second Match CSK Vs DC Match Live Updates Highlights | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2021: చెన్నైని మట్టికరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌

Published Sat, Apr 10 2021 7:01 PM | Last Updated on Fri, Apr 16 2021 7:03 PM

IPL 2021: Second Match CSK Vs DC Match Live Updates Highlights - Sakshi

ఢిల్లీ ఘనవిజయం
చెన్నై జట్టు నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఢిల్లీ ఓపెనర్లు శిఖర్‌ ధావన్ 54 బంతుల్లో‌ 85, పృథ్వీ షా 38 బంతుల్లో 72 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

స్టయినీస్‌ ఔట్‌
186 పరగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్‌ మార్కస్‌ స్టయినీస్ వికెట్‌ను‌ కోల్పోయింది.

శిఖర్‌ ధావన్‌ ఔట్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు 167 పరుగుల వద్ద శిఖర్‌ ధావన్‌ (85) వికెట్‌ను కోల్పోయింది.

తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు 138 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఢిల్లీ ఓపెనర్‌ పృథ్వీ షా 72 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బ్రావో బౌలింగ్‌లో మొయిన్‌ ఆలీకి క్యాచ్‌ ఇచ్చి మొదటి వికెట్‌ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం రిషబ్‌ పంత్ 7‌, శిఖర్‌ ధావన్‌ 72 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

► ధావన్‌, షాలు అర్థసెంచరీలు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పృథ్వీ షా, ధావన్‌లు పోటీ పడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. దీంతో 10 ఓవర్లలోనే ఢిల్లీ 100 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఈ నేపథ్యంలోనే ధావన్‌, షాలు అర్థ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం ఢిల్లీ 11 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 107 పరుగులు చేసింది.

పృథ్వీ షా హ్యాట్రిక్‌ ఫోర్లు.. 7 ఓవర్లకే 58/0
ఇన్నింగ్స్‌ 5వ ఓవర్లో పృథ్వీ షా వరుసగా మూడు ఫోర్లు బాదడంతో ఢిల్లీ స్కోరుబోర్డు పరుగులెత్తింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ 7 ఓవర్లలో 10 రన్‌రేట్‌తో 70 పరుగులు చేసింది. షా 38, ధావన్‌ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.

►189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షాలు బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ 4 ఓవర్లలో వికెట్ ‌నష్టపోకుండా 41 పరుగులు చేసింది. ధావన్‌ 22, పృథ్వీ షా 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

సామ్‌ కరన్‌ మెరుపులు.. సీఎస్‌కే భారీ స్కోరు
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. చివర్లో సామ్‌ కరన్‌ 15 బంతుల్లోనే 4 ఫోర్లు.. 2 సిక్సర్ల సాయంతో 34 పరుగులతో విజృంభించడంతో సీఎస్‌కే భారీ స్కోరు నమోదు చేసింది. కరన్‌కు జడేజా( 26, 17 బంతులు; 3 ఫోర్లు) సహకరించాడు. ఢిల్లీ బౌలర్లలో వోక్స్‌ 2, ఆవేశ్‌ ఖాన్‌ 2, అశ్విన్‌, టామ్‌ కరన్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

ధోని డకౌట్‌.. ఆరో వికెట్‌ డౌన్‌
సీఎస్‌కే వరుస విరామాల్లో రెండు వికెట్లను కోల్పోయింది. ఆవేశ్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ తొలి బంతికే రైనా( 54) రనౌట్‌ అయ్యాడు. జడేజాతో సమన్వయ లోపం వల్ల రైనా అవుట్‌ కావాల్సి​ వచ్చింది. ఆ తర్వాత ఒక్క బంతి తేడాతో కెప్టెన్‌ ధోని క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 137 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది.

అంబటి రాయుడు ఔట్‌ 

సీఎస్‌కే నాల్గో వికెట్‌ను కోల్పోయింది.  16 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లతో 23 పరుగులు చేసిన అంబటి రాయుడు నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. టామ్‌ కరాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన రాయుడు..  ధవన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.  దాంతో 123 పరుగుల వద్ద సీఎస్‌కే నాల్గో వికెట్‌ను  నష్టపోయింది. రైనా మెరుపు సెంచరీ తర్వాత రాయుడు ఔటయ్యాడు.

రైనా 32 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

గత ఐపీఎల్‌కు సీజన్‌కు దూరమైన సురేశ్‌ రైనా.. ఈ సీజన్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ చేశాడు. సీఎస్‌కే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో రైనా ఆదుకున్నాడు. ఒకవైపు  వికెట్‌ను కాపాడుకుంటూనే మోత మోగించాడు రైనా.  దాంతో 13 ఓవర్లలో సీఎస్‌కే మూడు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. 

60 పరుగులకే మూడు వికెట్లు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడో వికెట్‌ను నష్టపోయింది. సీఎస్‌కే స్కోరు 60 పరుగుల వద్ద ఉండగా మొయిన్‌ అలీ మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లతో 36 పరుగులు చేసిన మొయిన్‌.. అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన మొయిన్‌ మళ్లీ భారీ షాట్‌కు యత్నించి ధవన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

►ఢిల్లీ ‍క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదట ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ డు ప్లెసిస్‌ డకౌట్‌గా వెనుదిరగ్గా... వోక్స్‌ వేసిన మరుసటి ఓవర్లో 5 పరుగులు చేసిన రుతురాజ్‌ స్లిప్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సీఎస్‌కే 7 పరుగుల వద్దే వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ‌ 

ముంబై: ఐపీఎల్‌ 2021 సీజన్‌లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. ఎంఎస్‌ ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే, యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై వేదికగా హోరాహోరీగా తలపడనున్నాయి. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన సీఎస్‌కే ఈసారి ఆ ప్రదర్శన పునరావృతం కాకుండా చూసుకోవాలని భావిస్తుంది. మరోవైపు గత సీజన్‌లో ఫైనల్‌ చేరిన క్యాపిటల్స్‌ మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. అయ్యర్‌ గైర్హాజరీలో దూకుడు మీదున్న రిషబ్‌ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో నూతన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది.

ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌‌, పంత్‌ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ సూపర్‌ ఫామ్‌లో ఉండటం ఢిల్లీ జట్టులో ఎనలేని ఉత్సాహాన్ని నింపుతోంది. టీమిండియాకు మ్యాచ్‌ విన్నర్‌గా మారిన పంత్‌ అదే రీతిలో ఆడితే ఢిల్లీకి తిరుగుండదు. మరోవైపు చెన్నై జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఇటీవలి కాలంలో పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. ధోనీ, జడేజా, రైనా, రాయుడు డ్వేన్‌ బ్రావో చాలా రోజుల తర్వాత పొట్టి క్రికెట్‌ ఆడబోతున్నారు. ధోనీ వ్యూహాల ముందు పంత్‌ సైన్యం ఏమేరకు రాణిస్తుందో చూడాలి.

ఇక ఇరు జట్లు ఇప్పటివరకు 23 సార్లు తలపడగా.. 15 మ్యాచ్‌ల్లో సీఎస్‌కే విజయం సాధించగా.. 8 మ్యాచ్‌ల్లో డీసీ గెలిచింది. ఇక 2020 ఐపీఎల్‌ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీనే విజయం వరించింది. ఇక టీమ్స్ స్కోరు పరంగా చూస్తే.. ఢిల్లీపై అత్యధికంగా ఒకసారి చెన్నై టీమ్ 222 పరుగులు చేసింది. అలానే అత్యల్ప స్కోరు 110. మరోవైపు చెన్నైపై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 198కాగా.. అత్యల్ప స్కోరు 83 పరుగులే కావడం గమనార్హం.

తుది జట్లు:
సీఎస్‌కే: ఎంఎస్‌ ధోని(కెప్టెన్, వికెట్‌ కీపర్‌‌), రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, ఫాఫ్ డు ప్లెసిస్, సురేష్ రైనా, మొయిన్ అలీ, సామ్‌ కరాన్‌, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, డ్వేన్‌ బ్రావో

ఢిల్లీ క్యాపిటల్స్‌: రిషబ్‌ పంత్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానె, మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్‌మెయిర్‌, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, టామ్ కురన్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement