ముంబైతో రంజీ మ్యాచ్‌.. అదరగొట్టిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. రహానే, శ్రేయస్‌ సహా..! | Ranji Trophy 2024: Andhra Pradesh All Rounder Nitish Kumar Reddy Takes Five Wicket Haul Against Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైతో రంజీ మ్యాచ్‌.. అదరగొట్టిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. రహానే, శ్రేయస్ సహా..!

Published Sun, Jan 14 2024 10:31 AM | Last Updated on Sun, Jan 14 2024 10:43 AM

Ranji Trophy 2024: Andhra Pradesh All Rounder Nitish Kumar Reddy Takes Five Wicket Haul Against Mumbai - Sakshi

ముంబై: ‘ఎలైట్‌’ డివిజన్‌లో భాగంగా ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ యువ పేసర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతను అజింక్య రహానే, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి అంతర్జాతీయ స్థాయి బ్యాటర్లు సహా మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. నితీశ్‌ ధాటికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 395 పరుగులకు ఆలౌటైంది. రహానే (0), శ్రేయస్‌ (48) వికెట్లతో పాటు బిస్తా (39), షమ్స్‌ ములాని (38), తనుష్‌ కోటియన్‌ (54) వికెట్లు నితీశ్‌ ఖాతాలో పడ్డాయి.

లలిత్‌ మోహన్‌, షోయబ్‌ ఖాన్‌ తలో రెండు వికెట్లు, షేక్‌ రషీద్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ భుపేన్‌ లాల్వాని (61)తో పాటు లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు తనుష్‌ కోటియన్‌, మోహిత్‌ అవస్థి (53) అర్ధసెంచరీలతో రాణించగా.. సువేద్‌ పార్కర్‌ (41), కులకర్ణి (24 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. రహానే సహా రోస్టన్‌ డయాస్‌ (0), ప్రసాద్‌ పవార్‌ (15) నిరశపరిచారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్‌ (23), హనుమ విహారి (6), షేక్‌ రషీద్‌ (3) వెనుదిరగగా...ప్రశాంత్‌ కుమార్‌ (59 నాటౌట్‌), రికీ భుయ్‌ (4 నాటౌట్‌)  క్రీజ్‌లో ఉన్నారు. షమ్స్‌ ములానీ 2, రోస్టన్‌ డయాస్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ప్రస్తుతం ఆంధ్ర మరో 297 పరుగులు వెనుకబడి ఉంది.    

బ్యాటింగ్‌లోనూ నితీశ్‌ చిచ్చరపిడుగే..
విశాఖకు చెందిన 20 ఏళ్ల నితీశ్‌ కుమార్‌ రెడ్డి బంతితో పాటు బ్యాట్‌తోనూ సత్తా చాటగల సమర్ధత ఉన్న ఆటగాడు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన నితీశ్‌.. ఓ అండర్‌-16 సీజన్‌లో 1200కు పైగా పరుగులు సాధించి, తనలోని బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ సీజన్‌లో నితీశ్‌.. ఓ ట్రిపుల్‌ సెంచరీ, క్వాడ్రపుల్‌ సెంచరీ (400) సహా ఓ భారీ సెంచరీ (190) చేశాడు.

నితీశ్‌ గత రంజీ సీజన్‌లోనూ బంతితో రాణించాడు. 2022-23 సీజన్‌లో అతను 25కు పైగా వికెట్లు పడగొట్టి ఆంధ్ర జట్టులో కీలక బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడుతున్న నితీశ్‌.. టీమిండియాలో చోటే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. హార్దిక్ పాండ్యాలా నితీశ్‌ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని విశ్లేషకులు అంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement