కోహ్లి, రాహుల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌పై విజయం (PC: BCCI)
ICC Cricket World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ఆరంభంలోనే టీమిండియాకు గట్టి సవాల్ ఎదురైంది. చెన్నైలో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన రోహిత్ సేన.. లక్ష్య ఛేదనలో తడబడినా.. చివరాఖరికి గెలవగలిగింది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా విజయంతో మ్యాచ్‌ను ముగించగలిగింది.
శుబ్‌మన్ గిల్ స్థానంలో రోహిత్ శర్మకు జోడీగా వచ్చిన ఇషాన్ కిషన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా.. హిట్‌మ్యాన్ సైతం పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా వచ్చీగా రాగానే డకౌట్ అయి పెవిలియన్‌కు తిరిగి వెళ్లాడు.
కోహ్లి ఇచ్చిన ఆ క్యాచ్ పట్టి ఉంటే.. వామ్మో
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లి 85, రాహుల్ 97* పటిష్ట భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. నిజానికి.. మిచెల్ మార్ష్ గనుక హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో కోహ్లి ఇచ్చిన క్యాచ్ పట్టి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది.
అప్పటికి కోహ్లి స్కోరు 12 మాత్రమే. అలాంటి స్థితిలో మార్ష్ మిస్ చేసిన క్యాచ్.. టీమిండియా మ్యాచ్ గెలవడానికి పునాదిగా నిలిచింది. ఇలా మొదటి మ్యాచ్‌లోనే తడబడ్డ రోహిత్ సేన.. అక్టోబరు 11న అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది.
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానం ఇందుకు వేదిక. అయితే, అఫ్గన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ రెండో మ్యాచ్‌కు కూడా దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డెంగ్యూ బారిన పడిన గిల్ ఇంకా పూర్తిగా కోలుకోనట్లు సమాచారం.
ఇంకా కోలుకోని గిల్!
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘శుబ్‌మన్ గిల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. జట్టుతో పాటు అతడు ఢిల్లీకి ప్రయాణమవుతాడు. అయితే, ఛండీగడ్‌లోని తమ ఇంటికి వెళ్లాలని గిల్ అనుకోవడం లేదు.
పాక్‌తో మ్యాచ్ నాటికి?
టీమ్‌తో పాటే బస చేయాలనుకుంటున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ నాటికి అతడు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాం. అఫ్గనిస్తాన్‌తో బుధవారం మ్యాచ్ ఆడతాడా లేదా అన్నది తదుపరి మెడికల్ రిపోర్టు మీద ఆధారపడి ఉంటుంది’’ అని పేర్కొన్నాయి.
కాగా రెగ్యులర్ ఓపెనర్‌గా, సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్ జట్టుతో లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు. ఇషాన్ టీమ్‌లో ఉన్నప్పటికీ.. కొన్నాళ్లుగా మిడిలార్డర్‌లో ఆడుతున్న అతడు ఆసీస్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి విఫలమైన తీరు మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది.
చదవండి: CWC 2023 IND VS AUS: విరాట్ టెస్ట్ క్రికెట్‌లా ఆడమన్నాడు: కేఎల్ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment