జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
● మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: 2026 సంవత్సరంలో జమిలి ఎన్నికలు వస్తాయని వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి, ఉమ్మడి జిల్లా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల ప్రమాదానికి గురైన మండలంలోని కసుమూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత పఠాన్ హుస్సేన్, అనారోగ్యానికి గురైన షేక్ ఇలియాజ్, శ్రీరామపురానికి చెందిన రవీంద్రనాయుడు సతీమణి సుధమ్మను శుక్రవారం కాకాణి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘ఒక దేశం–ఒక ఎన్నికలు’ విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో 2026లోనే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తిరిగి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు ఒక్క తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న ఐదేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై పెద్దఎత్తున చర్చ జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమికి మద్దతుగా ఓటు వేసి మోసపోయాయని పశ్చాత్తాపం చెందుతున్నారని, అవకాశం వస్తే తిరిగి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక, గ్రావెల్, మట్టి తవ్వకాలతో మాఫియాలు రాజ్యమేలుతున్నాయే తప్ప, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment