సాగునీటి సంఘాల ఎన్నికలకు సన్నద్ధం
నెల్లూరు రూరల్: జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలను పక్కాగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని నెల్లూరు ఆర్డీఓ అనూష పేర్కొన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల అధికారులు, అసిస్టెంట్ ఎన్నికల అధికారులకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ.. ఉపసంహరణ.. పోటీలో నిలిచిన అభ్యర్థులు.. తదితరాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సోమశిల ప్రాజెక్ట్ ఎస్‌ఈ వెంకటరమణారెడ్డి, ఈఈ మల్లికార్జున అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడారు. అన్ని మండల కేంద్రాల్లో పీఓలు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నామని తెలిపారు.
మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా
నాగరాజమన్నార్
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా వీరవెంకటనాగరాజమన్నార్ బాధ్యతలను గురువారం స్వీకరించారు. మార్కాపురం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెల్లూరు మెడికల్ కళాశాలను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేలా చూస్తానని తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఎఫ్‌ఏసీ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తించిన గోవిందు తన బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ప్రిన్సిపల్‌కు పలువురు వైద్యులు అభినందనలను తెలియజేశారు.
ఐటీఐలో జాబ్ మేళా నేడు
నెల్లూరు (టౌన్): వెంకటేశ్వరపురంలోని బాలుర ఐటీఐలో జాబ్‌మేళాను ఏపీఎస్సెస్డీసీ, ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్, సీడాప్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్నామని ప్రిన్సిపల్ శ్రీధర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డైకిన్, హీరో మోటార్ కార్ప్ లిమిటెడ్, క్రెడిట్ ఆక్సిస్ గ్రామీణ్ లిమిటెడ్, భార్గవి ఆటోమొబైల్స్ తదితర కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. జిల్లాలో పదో తరగతి, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన వారు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు నిర్వహించనున్న జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు. వివరాలకు 94944 56326, 63015 29271 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
జిల్లాలో వర్షాలు
● సరాసరి వర్షపాతం 25.7 మిల్లీమీటర్లు
నెల్లూరు(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అత్యధికంగా దగదర్తి మండలంలో 75.4.. అత్యల్పంగా రాపూరులో 2.2 మిల్లీమీటర్ల వర్షం గురువారం పడింది. జిల్లా సరాసరి వర్షపాతం 25.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. కావలిలో 65.4, సంగంలో 57.8, ఆత్మకూరులో 51.2, కందుకూరులో 48.4, కలువాయిలో 47.2, జలదంకిలో 44.2, ఉలవపాడులో 44, అల్లూరు, అనంతసాగరంలో 41, బోగోలులో 35.4, గుడ్లూరులో 32.2, ఉదయగిరిలో 28.4, తోటపల్లిగూడూరులో 27.4, కోవూరులో 27.2, అనుమసముద్రంపేటలో 24 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సీతారామపురంలో 22.8, దుత్తలూరులో 22.8, వలేటివారిపాళెంలో 21.8, కలిగిరిలో 21.8, చేజర్లలో 20.4, వింజమూరులో 20.2, కొండాపురంలో 17, సైదాపురంలో 16.6, మర్రిపాడులో 16.2, బుచ్చిరెడ్డిపాళెంలో 15, వెంకటాచలంలో 14.8, ముత్తుకూరులో 14.2, లింగసముద్రంలో 12.4, మనుబోలులో 9.2, నెల్లూరు అర్బన్‌లో 7.8, ఇందుకూరుపేటలో 7.2, నెల్లూరు రూరల్‌లో 6.4, విడవలూరులో 6, పొదలకూరులో 4.6, వరికుంటపాడులో 4.2, కొడవలూరులో నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నేడూ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు శుక్రవారం కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తా యని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment