నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు బేఖాతర్
● సీఐ బందోబస్తు మధ్య కర్రకొట్టి తరలింపు
ఆత్మకూరు: రెండు వర్గాల మధ్య నెలకొన్న భూ వివాదంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులనే బేఖాతర్ చేస్తూ ఓ వర్గానికి కొమ్ము కాస్తూ వివాదానికి ఆజ్యం పోస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చేజర్ల మండలం మడపల్లిలో సుమారు 262 ఎకరాల పినాకిని షీప్ ఫాం పేరుతో రిజిస్టరైన భూముల విషయమై రెండు వర్గాల మధ్య వివాదం జరుగుతోంది. ఇటీవల ఒక వర్గం జామాయిల్ కర్రను పోలీస్ బందోబస్తు మధ్య కొట్టించి తరలించారు. ఈ రోజు స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో అసలు హక్కుదారులు తామే అయితే తమ ప్రత్యర్థులకు అండగా ఎలా నిలుస్తారని షీప్ ఫాం అధినేత అజయ్‌ఘోష్ అడ్డుకోవడంతో అతనితో పాటు మద్దతుగా వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో స్టే ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలో మంగళవారం జామాయిల్ కర్ర కొట్టేందుకు కూలీలు రాగా అజయ్‌ఘోష్ అనుచరులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న సంగం సీఐ వేమారెడ్డి పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, వారు కర్రకొట్టి తీసుకెళ్లేందుకు ఎవరూ అడ్డు చెప్పరాదని హెచ్చరించారు. అయితే తాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (కోర్టు) నుంచి స్టే ఆర్డర్ తెచ్చామని దాని ప్రకారం కర్ర కొట్టేందుకు వీల్లేదని షీప్ ఫాం అధినేత అజయ్‌ఘోష్, అతని అనుచరులు అడ్డు చెబుతున్నా సీఐ వినిపించుకోలేదు. ఆ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం శ్రీనివాసులురెడ్డికే చెందుతుందని, ఆ మేరకు 1బీలు, అడంగళ్లు వారి పేరుతోనే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తమకు ఇచ్చిన రికార్డులను చూపించారు. వారు తమకు తోటలోని కర్ర కొట్టి తరలించేందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరడంతో తాము వచ్చినట్లు తెలిపారు. అజయ్‌ఘోష్, అతని వర్గీయులు స్టే ఆర్డర్, తమ పేరుతో ఉన్న రికార్డులు చూపిస్తున్నా సీఐ పట్టించుకోలేదంటూ ఆరోపణలు చేశారు. ఆరు లారీల కర్రకొట్టి బద్వేల్ ఫ్యాక్టరీకి తరలించడంలో శ్రీనివాసులురెడ్డి వర్గీయులకు సీఐ సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment