ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపల్ పై వేటు
కొడవలూరు: నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడిన మండలంలోని చంద్రశేఖరపురం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ విష్ణుప్రతాప్ శుక్లాపై వేటు పడింది. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఆ స్థానంలో టి.విష్ణుప్రియను నియమిస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్కూల్‌లోని 25 మంది విద్యార్థులు కలుషిత నీరు తాగి అస్వస్ధతకు గురైన విషయం తెలిసిందే. స్కూల్‌లోని మినరల్ వాటర్ ప్లాంట్ ఆరు నెలలుగా మరమ్మతులకు గురైనా ప్రిన్సిపల్ శుక్లా పట్టించుకోలేదు. బురద, కలుషిత నీటినే వంటలకు, తాగేందుకు వినియోగించడంతో విద్యార్థులు డయేరియా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సైతం ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచారు. అయితే పిల్లలే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగమేఘాల మీద వైద్య సేవలందించారు. ఏకలవ్య స్కూల్‌లోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సోమవారం రాత్రి 10 గంటల సమయంలో స్కూల్‌ను సందర్శించారు. ఆ సమయంలోనూ ప్రిన్సిపల్ శుక్లా ఎమ్మెల్యేను లోనికి రానివ్వకుండా అడ్డుకునేందుకు యత్నించారు. శుక్లా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కలుషిత నీరు, నాణ్యత లేని భోజనం పెడుతూ ఇబ్బంది పెడుతున్నా రని ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో ఆమె ప్రిన్సిపల్ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందిస్తూ ప్రిన్సిపల్ శుక్లాను ప్రభుత్వానికి సరెండర్ చేసి, గతంలో ఇక్కడి స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేసి విద్యార్థులు, తల్లిదండ్రుల మన్ననలు పొందిన టి.విష్ణుప్రియను తిరిగి నియమించారు. మరమ్మతులకు గురైన మినరల్ వాటర్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే ఆదేశాలతో మంగళవారం ఆగమేఘాల మరమ్మతులు చేపట్టారు.
యానాదుల సంఘం ధర్నా
ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపల్ విష్ణుప్రతాప్ శుక్లా నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్కూల్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆ సంఘ అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ విద్యార్థుల హక్కులను హరించి నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ శుక్లాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్ధితి మెరుగు
ఏకలవ్య స్కూల్లో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని డీఎంహెచ్‌ఓ పెంచలయ్య తెలిపారు. మంగళవారం ఆయన పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. కలుషిత నీటి వల్లే విద్యార్థులు డయారియాకు గురవ్వడం జరిగిందన్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డీఎంహెచ్‌ఓ వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ బ్రిజిత, ఎంపీడీఓ ఏవీ సుబ్బారావు, వైద్యాధికారి ఎం.రామకృష్ణ, హెచ్‌ఏ షఫీ ఉద్దీన్ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వానికి ప్రిన్సిపల్
విష్ణుప్రతాప్ శుక్లా సరెండర్
కొత్త ప్రిన్సిపల్‌గా
విష్ణు ప్రియ నియామకం
మినరల్ వాటర్ ప్లాంట్‌కు మరమ్మతులు
మెరుగు పడిన విద్యార్థుల
ఆరోగ్య పరిస్థితి
Comments
Please login to add a commentAdd a comment