రిజర్వేషన్లను ఎత్తేసేందుకు కుట్ర
కందుకూరు: ఆరెస్సెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా రాజ్యాంగం నుంచి రిజర్వేషన్లను ఎత్తేసే కుట్రలో భాగంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ, మాలమహానాడు మాజీ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. కనిగిరి రోడ్డులోని మెర్సీ స్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన మాలల మహాగర్జన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. మాలలు, మాదిగల మధ్య అవగాహన లోపం కారణంగానే అనర్థాలు జరుగుతున్నాయని చెప్పారు. వర్గీకరణ ఉద్యమం సరైందికాదని శంకరన్ వంటి మేధావులు గతంలోనే చెప్పారని వివరించారు. అప్పట్లో దేశం మొత్తం తిరిగి 1032 కులాలను అధ్యయనం చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ రిజర్వేషన్లను రాజ్యాంగంలో పొందుపర్చారని వివరించారు. వర్గీకరణకు సంబంధంలేని అంశాలను మంద కృష్ణమాదిగ తీసుకొచ్చి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్‌ను అమలు చేయమని సుప్రీం కోర్టు చెప్పిందని, దీని ప్రకారం చూస్తే భవిష్యత్తులో వాచ్‌మెన్, అటెండర్ వంటి ఉద్యోగాలకు కూడా రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి ఉండదన్నారు.
మోసం చేసేందుకు చంద్రబాబు కుట్ర
రాజ్యాంగం.. సుప్రీం కోర్టు తీర్పుల మేరకు రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకునే కులాన్ని ఎంపిక చేయాలని ఉందే తప్ప, జిల్లా యూనిట్‌గా కులాన్ని ఎంపిక చేసే సదుపాయం లేదని తెలిపారు. అయితే సీఎం చంద్రబాబు జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్తున్నారని, ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మాదిగలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తిరిగి కోర్టును ఆశ్రయించనున్నామని, రాజ్యాంగం ప్రకారం ఎస్సీ వర్గీకరణ చెల్లదని నిరూపిస్తామని స్పష్టం చేశారు.
ఉద్యమ కార్యాచరణకు ప్రణాళిక
తెలంగాణలో ఉద్యమ కార్యాచరణకు ప్రణాళికను రూపొందిస్తున్నామని ఆ రాష్ట్రంలోని చెన్నూరు, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, నాగరాజు చెప్పారు. మాల ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి వినతిపత్రమిచ్చామని తెలిపారు. మాలల సింహగర్జన పేరుతో హైదరాబాద్‌లో డిసెంబర్ ఒకటిన పది లక్షల మందితో భారీ సభను నిర్వహించనున్నామని చెప్పారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవీప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ పండు అశోక్‌బాబు, మాల జేఏసీ అధికార ప్రతినిధి మంచా మల్లేశ్వరి, జాతీయ ఆర్గనైజర్ అన్నవరపు కిశోర్, మాల ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు, నియోజకవర్గ గౌరవ సలహాదారుడు దాసరి చినమాలకొండయ్య, వెంకటేశ్వర్లు, చనమాల వెంకటేశ్వర్లు, లింగాబత్తిన బ్రహ్మయ్య, గడ్డం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
దీని కోసమే ఎస్సీ వర్గీకరణ
మాలల మహాగర్జన సభలో మాజీ ఎమ్మెల్సీ జూపూడి
Comments
Please login to add a commentAdd a comment