ఆస్తి కోసమే కడతేర్చారు
కొడవలూరు: బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళేనికి చెందిన స్టీల్ సామాన్ల వ్యాపారి దేవళ్ల రమేష్‌ను ఆస్తి కోసమే రెండో కుమారుడు అజయ్ హత్య చేయించారని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. కొడవలూరు పోలీస్‌స్టేషన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఆస్తి విషయమై దేవళ్ల రమేష్‌కు ఆయన చిన్న కుమారుడు అజయ్‌కు మధ్య విభేదాలున్నాయి. ఈ తరుణంలో తండ్రిని హతమారిస్తే ఆస్తంతా తనకే వస్తుందని అజయ్ భావించారు. దీంతో బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన ఏడుగురితో రూ.ఐదు లక్షల సుపారీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. స్టీల్ సామాన్ల వ్యాపార నిమిత్తం ఆటోలో నార్తురాజుపాళెం వైపునకు ఈ నెల 22వ తేదీ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో బయల్దేరారు. ఈ క్రమంలో మిక్కిలింపేట క్రాస్ రోడ్డు వద్ద కార్లలో వచ్చిన కిరాయి వ్యక్తులు ఆటోను నిలిపి అందులో ఉన్న రమేష్ గొంతు నులిమి హత్యచేసి పరారయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు కేసును ఛేదించేందుకు సీఐ సురేంద్రబాబు, ఎస్సైలు కోటిరెడ్డి, నరేష్‌ను మూడు బృందాలుగా నియమించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు మూడు రోజుల్లోనే కేసును ఛేదించాయి.
సహకరించిన భార్య
కిరాయి హంతకులైన ఏడుగురిలో ఐదుగుర్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు కుమారుడు అజయ్, సహకరించిన మృతుడి భార్య సులోచనమ్మను అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. హత్యకు పాల్పడిన వారిలో గోళ్ల రుతేంద్ర, మందా పవన్ కల్యాణ్, గురునాథం తిరుపతయ్య, కట్టా సుధాకర్, నక్కా కాంతారావును అరెస్ట్ చేశారు. మరో ఇద్దర్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. సీఐ, ఎస్సైలను ఎస్పీ కృష్ణకాంత్ అభినందించి రివార్డులను ప్రకటించారని పేర్కొన్నారు.
స్టీల్ సామాన్ల వ్యాపారి హత్య కేసును ఛేదించిన పోలీసులు
హతుడి రెండో కుమారుడే నిందితుడు
ఏడుగురి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment