విప్‌ జారీ అయితే.. | - | Sakshi
Sakshi News home page

విప్‌ జారీ అయితే..

Published Mon, Feb 3 2025 12:21 AM | Last Updated on Mon, Feb 3 2025 12:21 AM

విప్‌

విప్‌ జారీ అయితే..

డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక అడుగులు

ఫ్యాన్‌ గుర్తుపై

గెలిచిన వారికి విప్‌ వర్తింపు

పార్టీకి రాజీనామా చేయకుండా

కండువాలు మార్చారు

ఫిరాయింపుదారులు వైఎస్సార్‌సీపీ సభ్యులుగానే గుర్తింపు

విప్‌ను ధిక్కరిస్తే అనర్హత తప్పదు

సుప్రీంకోర్టు, కేరళ కోర్టు జడ్జిమెంట్ల ఆధారంగా న్యాయపోరాటం

నిప్పు లాంటి విప్‌తో వైఎస్సార్‌సీపీ రాజకీయ ఆట మొదలు పెట్టింది. విప్‌ ధిక్కరిస్తే న్యాయస్థానంలో వారిపై అనర్హత వేటు పడేలా పక్కాగా ప్లానింగ్‌తో ముందుకెళ్తుండడంతో ఫిరాయింపుదారుల్లో ఆందోళన మొదలైంది. విప్‌ను ధిక్కరిస్తే అనర్హతకు గురికావడం ఖాయమని ఫిరాయింపుల చట్టంలోని పదో షెడ్యూల్లో సవరించిన చట్టం చెబుతోంది. ఈ ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీకి, ఫిరాయించిన ప్రజాప్రతినిధులను చట్ట ప్రకారంగానే ప్రజాకోర్టులో దోషులుగా నిలబెట్టాలనే వ్యూహంతో వైఎస్సార్‌సీపీ అడుగులు వేస్తోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీల్లో డిప్యూటీ మేయ ర్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపుదారులపై వైఎస్సార్‌సీపీ విప్‌ బ్రహ్మాస్త్రం సంధించనుంది. అధికార పార్టీ రాజకీయ అవసరాలు, ఆర్థిక ప్రయోజనాల తో పార్టీ ఫిరాయించి.. కండువాలు కప్పుకున్నప్పటికీ.. అధికారికంగా వీరు వైఎస్సార్‌సీపీ సభ్యులుగానే గుర్తించబడుతున్నారు. ఈ క్రమంలో ఏ మాత్రం విప్‌ ధిక్కరిస్తే వారి పదవీ గండం తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీ మరో పార్టీలో విలీనం జరిగితే అనర్హత వర్తించదు. కానీ ఒక పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యుల్లో మూడొంతుల్లో రెండొంతుల సభ్యులు పార్టీని ఫిరాయించినప్పుడు అనర్హత వేటు పడడం ఖాయమని ఫిరాయింపుల చట్టం స్పష్టం చేస్తోంది. టీడీపీ తరఫున డిప్యూటీ మేయర్‌ పదవికి బీఫారం కూడా జారీ చేసే అర్హత లేదు.

వైఎస్సార్‌సీపీకే మెజార్టీ సభ్యులు

నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో 54 డివిజన్లకు 54 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ సింబల్‌పై గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఖలీల్‌ అహ్మద్‌ ఇటీవల ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన పరిస్థితుల్లో డిప్యూటీ మేయర్‌తోపాటు కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేశారు. మేయర్‌ సైతం వైఎస్సార్‌సీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా.. అధికారికంగా ఆమోదం జరగలేదు. పార్టీ సభ్య త్వం రద్దు అయితే.. మేయర్‌ పదవిని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. కానీ అలా జరగలేదు కాబట్టి.. ప్రస్తుతం నెల్లూరు కార్పొరేషన్‌లో 53 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లుగా అధికారికంగా గుర్తించబడుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా, అందులో 18 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ సింబల్‌పై గెలిచిన వారే కౌన్సిలర్లుగా ఉన్నారు.

రాజకీయ అస్త్రసన్యాసం తప్పదా?

డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పార్టీ విప్‌ ధిక్కరిస్తే రాజకీయ అస్త్రసన్యాసం తప్పదని రాష్ట్రంలో ఎంపీటీసీల నుంచి ఎంపీల విషయంలో తేటతెల్లమైంది. జిల్లాలో 2014 నుంచి 2019 వరకు జిల్లా పరిషత్‌, నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో అనాటి అధికార పార్టీ ప్రోత్సహించిన ఫిరాయింపుదారుల రాజకీయ భవిష్యత్‌ అంధకారమైన విషయం విదితమే. ఆ నాడు పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో రాజకీయాల్లో కనమరుగైపోయారు. తాజాగా జరగబోయే ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపుదారులకు అదే గతి పడుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు.

పచ్చకండువా కప్పుకున్నా..

నెల్లూరులో కార్పొరేటర్లు, బుచ్చిరెడ్డిపాళెంలో కౌన్సిలర్లు కొందరు అధికార పార్టీలో ఉంటే నాలుగు రాళ్లు వేనకేసుకోవచ్చని భావించి పచ్చ కండువాలు కప్పుకున్నారు. అయితే అధికార పార్టీలో ఉన్నామనే కానీ.. కనీసం వారికి ఎలాంటి గుర్తింపు, గౌరవం లేదని తెలుస్తోంది. ఆయా డివిజన్లు, వార్డుల్లో వీరితో ప్రత్యర్థులుగా పోరాడిన వారిదే పెత్తనం కావడంతో కండువాలు తప్ప.. వీరికి దక్కింది ఏదీ లేదు. తాజాగా ఎన్నికల్లో వాడుకునేందుకు అధికార పార్టీ ఎన్నెన్నో ఆశలు రేకిత్తిస్తోంది. అయితే వీరిని గెలిచిన పార్టీ నుంచి విప్‌ అస్త్రం భయపెడుతోంది. వైఎస్సార్‌సీపీ ఈ విషయంలో పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడంతోపాటు, న్యాయస్థానం ద్వారా వీరిని అనర్హులుగా ప్రకటింపజేయాలని ప్రయత్నం చేస్తోంది. ఇదే జరిగితే.. అటు అధికారానికి, పదవులకు దూరం కాక తప్పదని తెలుస్తోంది.

డిప్యూటీ మేయర్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కరిముల్లా..

వైఎస్సార్‌సీపీ తరఫున డిప్యూటీ మేయర్‌గా 42 డివిజన్‌ కార్పొరేటర్‌ షేక్‌ కరిముల్లాను జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెరెడ్డిప్రకటించారు. గతంలో డిప్యూటీ మేయర్‌గా ఖలీల్‌ అహ్మద్‌కు ఇచ్చారు. మళ్లీ కూడా ముస్లిం మైనార్టీలకు కేటాయించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో వారికే కేటాయించారు.

చీఫ్‌ విప్‌గా ఊటుకూరు

నెల్లూరు నగర కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సంబంధించిన వైఎస్సార్‌సీపీ చీఫ్‌ విప్‌ 13 డివిజన్‌ కార్పొరేటర్‌ ఊటుకూరు నాగార్జునను నియమిస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో చీఫ్‌ విప్‌ హోదాలో నాగార్జున వైఎస్సార్‌సీపీ సింబల్‌పై గెలిచిన సభ్యులు అందరికీ విప్‌ పత్రాలను అందజేశారు.

డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు ఏర్పాట్లు

నెల్లూరు (బారకాసు): నెల్లూరు నగరపాలక సంస్థలో ఖాళీ ఏర్పడిన డిప్యూటీ మేయర్‌ పదవికి సోమవారం కౌన్సిల్‌ సమావేశ మందిరంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికల అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ వ్యవహరించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రయ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఎన్‌ఎంసీ అధికారులు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకు నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి మేయర్‌, కార్పొరేటర్లు, సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్‌ అధికారులు ఎన్‌ఎంసీ కార్యాలయ ప్రాంగణంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మీడియా ప్రతినిధులకు జారీ చేసిన పాస్‌లతో హాజరైన వారినే కౌన్సిల్‌ హాల్లోకి అనుమతించనున్నారు.

విప్‌ జారీ అయితే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఫిరాయింపుల చట్టం చెబుతోంది. 1980లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పదో షెడ్యూల్లో చేర్చారు. 2003లో పంచాయతీరాజ్‌ చట్టాన్ని కూడా సవరణ చేశారు. ఈ ప్రకారం పార్టీ విప్‌ను ఉల్లంఘించి వేరే పార్టీకి ఓటు వేసినా.. పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఓటింగ్‌కు గైర్హాజరైనా ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. తాజాగా కేరళ హైకోర్టు కూడా ఇలాంటి తీర్పునే ఇచ్చింది. ఈ క్రమంలో విప్‌ ఉల్లంఘించిన వారిపై వైఎస్సార్‌సీపీ న్యాయస్థానం ద్వారా అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. ఈ మేరకు వారు న్యాయ నిపుణులతో సిద్ధంగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విప్‌ జారీ అయితే.. 
1
1/2

విప్‌ జారీ అయితే..

విప్‌ జారీ అయితే.. 
2
2/2

విప్‌ జారీ అయితే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement