అగ్రరాజ్యాలకు దీటుగా భారత్
● అన్ని రంగాల్లో వేగంగా భారత్ అభివృద్ధి
● డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ గుండ్రా సతీష్‌రెడ్డి
వింజమూరు (ఉదయగిరి): 2016కు ముందు భారత్ అన్నీ అంశాల్లో దిగుమతులు చేసుకుంటూ విదేశాలపై ఆధారపడేది. ఇప్పుడు మనమే ప్రపంచ అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ఎగుమతి చేసే స్థాయికి చేరున్నామని మాజీ డీఆర్‌డీఓ చైర్మన్, భారత రక్షణ శాఖ సాంకేతిక సలహాదారులు గుండ్రా సతీష్‌రెడ్డి తెలిపారు. వింజమూరులో ఆదివారం అపస్ అధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతుల కార్యక్రమంలో మాట్లాడారు. మన ఆలోచన విధానమే మన భవిష్యత్‌ను నిర్ధేస్తుందన్నారు. బిహార్, ఒడిశా, రాజస్థాన్ వెనుకబడిన ప్రాంతాలుగా చెబుతున్న ప్పటికీ అక్కడ నుంచి ప్రతి ఏడాది ఎంతో మంది సివిల్ సర్వీసుకు ఎంపికవుతున్నాని గుర్తు చేశారు. మన దేశంలో యువత మేధా శక్తిని కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నట్లు చెప్పారు. 2015కు ముందు దేశంలో 458 అంకుర సంస్థలు ఉంటే నేడు 1.60 లక్షలు ఉన్నట్లు చెప్పారు. పేపర్ ప్రజంటేషన్, పీహెచ్‌డీలో మన విద్యార్థులు ప్రపంచ దేశాల్లో మూడో స్థానంలో ఉన్నారన్నారు. ఈ ఏడాది రక్షణ రంగంలో మనం ప్రపంచ దేశాలతో రూ.21 వేల కోట్లు వ్యాపారం చేశామన్నారు. ఇప్పటి నుంచే గోల్ పెట్టుకుని దాని కోసం శ్రమిస్తే విజయం తథ్యమన్నారు. ఉదయగిరి ప్రాంతంలో స్కిల్ డెవల్‌పెంట్ సెంటర్ల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే కాకర్ల మాట్లాడుతూ యువత మంచి మార్గంలో నడిచి దేశ, సమాజ సేవలో తమ వంతు పాత్ర పోషించాలి అని సూచించారు. పేద విద్యార్థుల ఉన్నత విద్యకోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం టాలెంట్ టెస్టులో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అపస్ అధ్యక్షుడు యల్లాల వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, డాక్టర్ మాసిలామణి, అపప్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాలాజీ, స్థానిక నేతలు వెంగయ్య, రమాదేవి, మధు, కె.రాజగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment