పిచ్చోడి చేతిలో పాలన | - | Sakshi
Sakshi News home page

పిచ్చోడి చేతిలో పాలన

Published Mon, Feb 3 2025 12:21 AM | Last Updated on Mon, Feb 3 2025 12:21 AM

-

నెల్లూరు(బారకాసు): నెల్లూరు కార్పొరేషన్‌లో మంత్రి నారాయణ విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని, పిచ్చోడి చేతిలో పాలనగా సాగుతుందని కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం నగరంలోని రాంజీనగర్‌లో ఉన్న నెల్లూరు నగర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లతో కలిసి కాకాణి మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ మద్దతుదారులను వేధింపులు గురిచేయడమే కాకుండా వారి ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ నేత బాలకృష్ణారెడ్డి ఇంటికి సంబంధించి 40 సంవత్సరాల డాక్యుమెంట్స్‌ ఉన్నప్పటికీ కక్ష పూరితంగా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఆ భవనాన్ని నిట్టనిలువునా మంత్రి నారాయణ కూల్చివేయించారని మండిపడ్డారు. ఈ విషయంలో కమిషనర్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రేపు కోర్టులో నిలబడాల్సిన పరిస్థితి తప్పదని చెప్పారు. నిరుపేదలు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లు కూలగొడితే ఆ బాధ ఎలా ఉంటుందో మంత్రి నారాయణకు తెలుసా అని ప్రశ్నించారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, తప్పు చేసిన అధికారులను వదిలే ప్రసక్తే లేదన్నారు. పన్నులు చెల్లించని ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటామని బోర్డులు ఏర్పాటు చేయడం సిగ్గు చేటన్నారు.

తొమ్మిది నెలలుగా విధ్వంసకర పాలన

ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. తమ పార్టీ నేత బాలకృష్ణారెడ్డి ఇంటిని మంత్రి నారాయణ కక్ష పూరితంగా కూల్చివేయించారని, ఆ పార్టీ పట్ల ప్రజల్లో అసహ్యం ఏర్పడిందన్నారు. బాలకృష్ణారెడ్డికి వైఎస్సార్‌సీపీ అండగా నిలబడి న్యాయ పోరాటం చేయడమే కాకుండా, ఈ విషయాన్ని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని ప్రజలకు కమిషనర్‌ ఎంతో మేలు చేస్తారని అనుకుంటే, మంత్రి నారాయణ పాలేరుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. 51వ డివిజన్‌లో తమ పార్టీ కార్యకర్త శౌరికి సంబంధించిన 5 షాపులను మూసివేయించి 50 కుటుంబాలను రోడ్డున పడేసి మంత్రి నారాయణ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు.

మంత్రి నారాయణ విష సంస్కృతిని

పోషిస్తున్నారు

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. తప్పు

చేసిన అధికారులను వదిలే ప్రసక్తే లేదు

వైఎస్సార్‌సీపీ నేత భవనాన్ని

కూల్చి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు

కోర్టులో కమిషనర్‌ నిలబడక తప్పదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement