విధేయతకు, వెన్నుపోటు మధ్య పోటీ
నెల్లూరు(బారకాసు): నెల్లూరు కార్పొరేషన్‌లో జరగనున్న డిప్యూటీ మేయర్ ఎన్నిక ధర్మానికి– అధర్మానికి, విధేయతకు–వెన్నుపోటుకు మధ్య జరుగుతేందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాకాణి మాట్లాడారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని వెల్లడించారు. తమ పార్టీ అభ్యర్థిగా 42వ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లాను పోటీకి దింపుతున్నామన్నారు. విప్‌గా కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జునను నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కొందరు పార్టీకి ద్రోహం చేసి, టీడీపీలో చేరిన వారు ఆత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలన్నారు. జిల్లాలో మైనార్టీలకు మొదట పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని చెప్పారు. టీడీపీ గతంలో ఒక కార్పొరేటర్‌ను కూడా గెలిపించుకోలేకపోయినా వైఎస్సార్‌సీపీ బీఫారంపై గెలిచిన వారిని నిస్సిగ్గుగా తమ అభ్యర్థి అని ప్రకటించుకుని బీఫారం ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. నైతిక విలువలకు, మోసానికి మధ్య పోటీ జరుగుతుండడంతో నెల్లూరు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ గుర్తు మీద గెలిచిన వారికి విప్ జారీ చేస్తున్నామని, ధిక్కరిస్తే అనర్హత వేటు తప్పదని స్పష్టం చేశారు. మంత్రి నారాయణకు అవగాహన లేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరాంటూ ప్రకటించడం సిగ్గు చేటన్నారు. ఇప్పటి దాక ఒక్క పథకమైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. మంత్రి నారాయణ ప్రతి కార్పొరేటర్‌ని బెదిరిస్తున్నారని, పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు పోటీ చేస్తామంటున్నారని, పోటీ చేస్తామన్న వారందరిని బుజ్జగించేందుకు ఆయన డబ్బులు పంపిణీ చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ మైనార్టీలకు రాజ్యాధికారం వైపు అడుగులేస్తూ అబ్దుల్‌అజీజ్ కి మేయర్‌గా అవకాశం ఇస్తే, ఆయన పార్టీ మారి తన రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పెట్టుకున్నారని గుర్తు చేశారు. అజీజ్‌తో వెళ్లిన కార్పొరేటర్లు దాదాపు ఎవరూ కూడా తిరిగి రాజకీయాల్లో కొనసాగలేకపోయారని తెలిపారు. పార్టీ మారితే రాజకీయ జీవితం అంతం అవుతుందని, గత కార్పొరేటర్ల మాదిరిగా చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని హితవు పలికారు. అనంతం డిప్యూటీ మేయర్ అభ్యర్థి కరిముల్లాకు బీ ఫారం అందజేశారు.
వైఎస్సార్‌సీపీ డిప్యూటీ మేయర్
అభ్యర్థిగా కరిముల్లా
విప్‌గా కార్పొరేటర్ ఊటుకూరు
నాగార్జున
జిల్లాలో మైనార్టీలకు మొదట పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్‌దే
కొందరు కార్పొరేటర్లు పార్టీకి
ద్రోహం చేసి టీడీపీలో చేరారు
ఆత్మప్రబోధం మేరకు ఓటేయాలి
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment