భూములిస్తే.. మేం బతికేదెలా?
కావలి: సముద్రంలో చేపలు వేటాడం వృత్తిగా బతికే తమకు, వేట సాగక పొలాల్లో సేద్యం చేసుకుంటూ బతుకుతున్నాం. ఇప్పుడు ఉన్న అరకొర భూములు ఇస్తే మేం బతికేదెలా అంటూ కావలి మండలం పెద్దపట్టపుపాళెం పంచాయతీలోని గ్రామాల మత్స్యకారులు అధికారులను ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, అందుకు అవసరమైన భూములు తీసుకుంటామని మారిటైం బోర్డు అధికారులు, కావలి ఆర్డీఓ వంశీకృష్ణతోపాటు రెవెన్యూ అధికారులు ఆదివారం గ్రామ సభ నిర్వహించారు. చాటింపు, దండోరా వేయకుండానే, గ్రామస్తులకు కనీసం సమాచారం తెలియకుండా గ్రామసభ ఏర్పాటు చేయడంతో రైతులు నిలదీశారు. అధికారులు మాగాణికి ఎకరాకు రూ.15 లక్షలు, మెట్టకు రూ.12.5 లక్షలు చొప్పున ప్రభుత్వం ధర నిర్ణయించిందని చెప్పారు. దీంతో ఆయా గ్రామాల రైతులు అధికారుల తీరుపై మండిపడ్డారు. చెన్నాయపాళెం గ్రామానికి చెందిన రైతులు సేద్యంతోపాటు పాడితో బతికే తమ పొలాలను తీసుకుంటే తామెలా బతకాలంటూ సహనం కోల్పోయారు. అది కూడా అన్యాయమై న ధరలకు ఎందుకు ఇవ్వాలంటూ నిలదీశారు. ఇక్కడ మాగాణి ఎకరా రూ.55 లక్షలు ధర పలుకుతుందని, మెట్ట రూ. 40 లక్షలు ధర ఉందన్నారు. అధికారులు చెప్పే ధరకు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
మరీ అన్యాయంగా ఉంది
మా పంచాయతీని ఆనుకొనే రామాయప ట్నం పోర్టును నిర్మిస్తున్నారు. పోర్టు నిర్మిస్తే మా బతుకులు మరింత మెరుగ్గా మారుతాయని ఆశ పడ్డాం. చేపలు పట్టడం, సేద్యం పనులు చేయడం తప్ప ఇతర పనులు రాని మేము, మా భూములు తీసుకుంటే ఎలా బతకాలి. మా పంచాయతీలోని గ్రామాలకు సమాచారం లేకుండా వేరే పంచాయతీలో గ్రామసభ పెట్టారు. మా పంచాయతీ గ్రామాల్లో భూములు తీసుకోవడానికి, పక్క పంచాయతీలో గ్రామసభ పెట్టడం ఏమిటిఽ. మరీ అన్యాయంగా ఉంది. ధర కూడా దారుణంగా ఉంది. మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు.
– గంగనగారి యాదగిరి,
మత్స్యకారుడు, పెద్దపట్టపుపాళెం
Comments
Please login to add a commentAdd a comment