అమరనాథ్‌రెడ్డిపై కేసుల పరంపర
● వీరచిన్నయ్యగారిపల్లిలో
నకరికల్లు పోలీసుల విచారణ
కదిరి అర్బన్: కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ వీరచిన్నయ్యగారి పల్లి వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ మలక అమరనాథ్‌రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయకుండా రూ.99కే క్వార్టర్ మద్యాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని ఉటంకిస్తూ ‘విద్య వద్దు.. మద్యం ముద్దు’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై పల్నాడు జిల్లా నకరికల్లు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు బుధవారం వీరచిన్నయ్యగారి పల్లికి వచ్చారు. అయితే అమరనాథరెడ్డి అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులను కలిసి విచారించారు. ఈ కేసుతో కలిపి అమరనాథరెడ్డిపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ పాలనపై భావ ప్రకటనను సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంటే ఇలా కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టడం ఏంటని పలువురు గ్రామస్తులు చర్చించుకోవడం కనిపించింది. పాలనలో లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుని ముందుకు పోవాలి గానీ ప్రశ్నించడమే మహాపరాధం అంటే ఎలా అని ప్రభుత్వ తీరును తప్పు పట్టారు.
12 మండలాల్లో వర్షం
● వరి, కంది పంటలు
దెబ్బతింటాయని రైతుల ఆందోళన
పుట్టపర్తి అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలోని 12 మండలాల్లో వర్షం కురిసింది. తలుపుల మండలంలో 27.4 మి.మీ, గాండ్లపెంట 22.6, నల్లచెరువు 16.8, ఎన్‌పీ కుంట 15.2, ఓడీ చెరువు 10.2, కదిరి 9.2, గోరంట్ల 6.2, తనకల్లు 5.8, అమడగూరు 5.6, నల్లమాడ 2.6, ముదిగుబ్బ 2.2, పుట్టపర్తిలో 1.6 మి.మీ వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావంతో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి మడులు పడిపోగా.. వాటిలో తేమ ఆరిన తర్వాత కోతలు కోస్తున్నారు. ఇప్పుడిప్పుడే వడ్లు కల్లాలకు చేరుతున్నాయి. ఈ సమయంలో వర్షం కురిస్తే వడ్లు మొలక వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వడ్లు క్వింటాలు రూ.2 వేలతో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరకు అమ్మలేక, అలాగే ఉంచుకోలేక సతమతమవుతున్నారు. ఇక నాలుగు నెలల క్రితం సాగు చేసిన కంది పంటలో ఇటీవల కురిసిన వర్షాలకు పూత రాలిపోగా.. ప్రస్తుతం మరోసారి పూత వచ్చింది. తుపాను ప్రభావంతో వర్షం కురిస్తే పూత రాలిపోతే కంది పంట దెబ్బతిన్నట్లేనని రైతులు వాపోతున్నారు.
పనిభారం తగ్గించండి
● ప్రభుత్వ ఆస్పత్రి నర్సుల ఆవేదన
హిందూపురం టౌన్: స్థానిక జిల్లా ఆస్పత్రిలో పనిభారంతో నర్సులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే అంశాన్ని బుధవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింగన్న దృష్టికి బుధవారం పలువురు నర్సులు తీసుకెళ్లారు. 40 మంది స్టాఫ్ నర్సులకు గాను 29 మంది మాత్రమే ఉన్నామని, 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. గతంలో రాత్రి డ్యూటీలు మూడు నెలలకోసారి ఉండేవని, ఇప్పుడు రెండు నెలలకోసారి డ్యూటీలు వేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో పనిభారం అధికమైందన్నారు. ఈ క్రమంలో రోగులకు సేవలందించడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. దీనిపై సూపరింటెండెంట్ మాట్లాడుతూ... సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చొరవ తీసుకుంటానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డేవిడ్ రాజ్, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment