ఖాద్రీశుని హుండీ ఆదాయం రూ.87.14 లక్షలు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామికి హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించినట్లు ఆలయ ఈఓ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 67 రోజులకు గాను రూ.87,14,129 నగదు, 57 గ్రాముల బంగారం, 352 గ్రాముల వెండి లభించిందన్నారు. అలాగే 606 అమెరికా డాలర్లు, 300 అరబ్ డాలర్లు, 20 కెనడా డాలర్లు హుండీ ద్వారా స్వామివారికి భక్తులు సమర్పించినట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే ఈసారి ఆదాయం ఎక్కువ వచ్చినట్లు ఈఓ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో హుండీల లెక్కింపు పర్యవేక్షాణాధికారి సి.రవీంద్రరాజు, కెనరా బ్యాంక్ మేనేజర్ అనంతబాబు, ఆలయ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
‘ఉపాధి’ కూలీల సంఖ్య పెంచాలి
● డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్
నల్లచెరువు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య మరింత పెంచాలని డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్ ఆదేశించారు. మంగళవారం ఆయన ఏపీడీ రమేష్ బాబు, ఎంపీడీఓ రఘునాథ గుప్తాతో కలిసి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ మాట్లాడుతూ, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు కల్పించాలన్నారు. మండలంలో రోజూ 2,200 మందికి పనులు కల్పించాలన్నారు. ‘ఉపాధి’కి డ్రైల్యాండ్ హార్టికల్చర్ అనుసంధానం చేసిన నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించి హార్టికల్చర్ ప్లాంటేషన్ మొక్కలను పూర్తి స్థాయిలో నాటించాలన్నారు. సమావేశంలో ఏపీఓ మంజుల, ఈసీ బాలు నాయక్, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.
అమరనాథ్‌రెడ్డిపై మరో కేసు
కదిరి అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కన్వీనర్ మలక అమరనాథ్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించిన పాపానికి ఇప్పటికే అమరనాథ్‌రెడ్డిపై ఐదు కేసులు నమోదయ్యాయి. తాజాగా గుంటూరు జిల్లా పెదనందిపాడు పోలీసులు కూడా ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు మంగళవారం పెదనందిపాడు పోలీసులు అమరనాథ్‌రెడ్డి స్వగ్రామం కదిరి మండంలోని వీరచిన్నయ్యగారిపల్లికి వచ్చారు. అయితే అమరనాథ్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అతికించి వెళ్లారు. కాగా, అమరనాథ్‌రెడ్డి ఇంటికి రోజూ ఏదో ఒక జిల్లా నుంచి పోలీసులు వస్తున్నారు. తమ స్టేషన్‌లో కేసు నమోదైందని, విచారణకు రావాలని చెబుతున్నారు. దీంతో అమరనాథ్‌రెడ్డి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు.
వీసీల నియామకం..
మరింత ఆలస్యం!
అనంతపురం: జేఎన్‌టీయూ, ఎస్కేయూలకు కొత్త వీసీల నియామక ప్రక్రియలో మరింత జాప్యం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం జేఎన్‌టీయూ పాలకమండలి సమావేశం జరగ్గా.. ‘వీసీ సెర్చ్ కమిటీ’లో వర్సిటీ నామినీకి సంబంధించిన అంశం ప్రస్తావించకపోవడం గమనార్హం. వాస్తవానికి నామినీ ఎంపికే ప్రధాన అంశంగా సమావేశం నిర్వహించినప్పటికీ ఆ విషయం కనీసం చర్చకు కూడా రాలేదు. దీంతో జేఎన్‌టీయూ వీసీ నియామకం మరింత ఆలస్యం కానుంది. ఇక.. బుధవారం జరిగే ఎస్కేయూ పాలకమండలి సమావేశంలోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రెండు వర్సిటీల పాలకమండలి సమావేశాలూ మంగళవారం జరగాల్సి ఉన్నప్పటికీ ఎస్కేయూలో జమున అనే ఉద్యోగి మరణించడంతో మంగళవారం సెలవు ప్రకటించారు. దీంతో పాలకమండలి సమావేశం బుధవారం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment