3,65,175 హెక్టార్లు జిల్లాలో సాగుభూమి విస్తీర్ణం | - | Sakshi
Sakshi News home page

3,65,175 హెక్టార్లు జిల్లాలో సాగుభూమి విస్తీర్ణం

Published Wed, Nov 20 2024 1:05 AM | Last Updated on Wed, Nov 20 2024 1:05 AM

3,65,

3,65,175 హెక్టార్లు జిల్లాలో సాగుభూమి విస్తీర్ణం

2.05 లక్షల హెక్టార్లు వేరుశనగ సాగు విస్తీర్ణం
1,62,800 హెక్టార్లు ఖరీఫ్‌లో సాగైన పంట
1,332 హెక్టార్లు వర్షానికి దెబ్బతిన్న పంట

పుట్టపర్తి మండలం ఇరగరాజుపల్లికి చెందిన రమణ ఈ ఏడాది ఖరీఫ్‌లో 4 ఎకరాల పొలంలో వేరుశనగతో పాటు కంది సాగుచేశాడు. విత్తనాలకు రూ.22 వేలు, సాగుకు రూ.18 వేలు, ఎరువులకు రూ.8 వేలు, కలుపు తొలగించేందుకు రూ.12 వేలతో పాటు మందులు పిచికారీ చేసినందుకు రూ.6 వేలు, పంటకోతకు రూ.16 వేలు, వేరుశనగ కాయలు విడిపించేందుకు మరో రూ.8 వేలు కలిపి మొత్తంగా రూ. 90 వేలు ఖర్చు చేశాడు. కానీ 4 ఎకరాల్లో పంట వేస్తే కేవలం 13 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. దీంతో కనీసం పెట్టుబడులు కూడా చేతికి అందలేదు. ఈసారి ఖరీఫ్‌లో వేరుశనగ సాగుచేసిన ప్రతి రైతుదీ ఇదే పరిస్థితి.

బత్తలపల్లిలో దెబ్బతిన్న వేరుశనగ పంట(ఫైల్‌)

3 బస్తాలు

ఎకరాకు వచ్చిన దిగుబడి

కదిరి: వర్షాధార పంటగా ఈఖరీఫ్‌లో సాగుచేసిన ప్రధాన పంట వేరుశనగ రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఓ వైపు అతివృష్టి... మరోవైపు అనావృష్టి కారణంగా వేరుశనగ సాగుచేసిన రైతన్నలు నిండా మునిగిపోయారు. లాభం సంగతి దేవుడెరుగు..కనీసం పెట్టుబడులు కూడా చేతికి దక్కలేదు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులు నిర్వహించిన పంటకోత ప్రయోగాల్లో దిగుబడి బాగా తగ్గినట్లు తేలింది.5x5 విస్తీర్ణంలో పంట తీయగా కేవలం 1.50 కిలోలు మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ లెక్కన ఎకరాకు కేవలం 3 నుంచి 4 బస్తాల లోపే దిగుబడులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

రెక్కలకష్టం నీటిపాలు

జిల్లాలో 3,65,175 హెక్టార్ల సాగుభూమి ఉండగా అందులో ప్రధాన పంట వేరుశనగ సాగువిస్తీర్ణం 2.05 లక్షల హెకార్లుగా ఉంది. ఇందులో ఈసారి ఖరీఫ్‌లో 70 వేల ఎకరాల్లో వేరుశనగ, 16 వేల ఎకరాల్లో కంది, 7 వేల ఎకరాల్లో మొక్కజొన్న ఇంకా అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 1,62,800 హెక్టార్లు సాగులోకి వచ్చాయి. అయితే వేరుశనగ పంట పూత దశలో ఉన్నప్పుడు వర్షం కురవలేదు. ఎలాగోలా రైతులు కాపాడుకున్నా... ఆ తర్వాత పంటచేతికొచ్చే సమయంలో వరుస తుపాన్లు కారణంగా పంట మొత్తం పొలంలోనే తడిసి ముద్దయ్యింది. దీంతో రైతుల రెక్కల కష్టం నీటిపాలైంది. అతివృష్టి కారణంగా జిల్లా వ్యాప్తంగా 1,332 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో వెల్లడించారు. ఖరీఫ్‌లో పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు వాపోతున్నారు.

కరువు మండలాల ప్రకటనలోనూ అన్యాయమే

జిల్లాలోని అన్ని మండలాల్లోనూ కరువు తాండవించింది. అయితే కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితాలో జిల్లా ముదిగుబ్బ, తలుపుల, తాడిమర్రి మండలాలను మాత్రమే చోటు దక్కింది. ఒక మోస్తారు కరువు మండలాలుగా కనగానపల్లి, ధర్మవరం, గాండ్లపెంట, ఎన్‌పీ కుంట, పరిగి, రామగిరి, బుక్కపట్నం మండలాలను మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన 22 మండలాలను ప్రభుత్వం కరువు జాబితాలో చేర్చకపోవడంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే జిల్లా రైతాంగం సంక్షేమంపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

గతంలో అన్నదాతకు ఆర్థిక భరోసా

ఖరీఫ్‌ సీజన్‌లో విత్తనాల కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది పడకుండా గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగుకు ముందే రైతులకు పెట్టుబడి సాయం అందించేది. ఇందులో కేంద్రం ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ ద్వారా ఇచ్చే రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మరో రూ. 7,500 కలిపి మొత్తంగా 13,500 ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పేరుతో ఏటా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. జిల్లాలో 2,92,170 మంది రైతులుండగా వీరిలో 2,79,556 మంది రైతులకు గత ఐదేళ్లలో వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారానే రూ.1,767.09 కోట్ల లబ్ధి చేకూరింది. అది కూడా ఏటా మూడు విడతల్లోనూ చెప్పిన సమయానికి సకాలంలో గత ప్రభుత్వం జమ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ‘అన్నదాత సుఖీభవ’ అని పేరు మార్చిందే తప్ప... ఇంతవరకూ రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమచేయలేదు.

3 ప్రభుత్వం ప్రకటించిన

కరువు మండలాలు

482 హెక్టార్లలో వేరుశనగ నష్టం

ఈ ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ పంట మొదట్లో వర్షం లేక కొంత ఎండిపోయింది. చివర్లో తుపాన్ల కారణంగా దెబ్బతినింది. అందుకే దిగుబడులు బాగా తగ్గాయి. తుపాను దెబ్బకు 482 హెక్టార్లలో వేరుశనగ, 540 హెక్టార్లలో వరి, 119 హెక్టార్లలో మొక్కజొన్న ఇలా వివిధ రకాల పంటలు మొత్తంగా 1,332 హెక్టార్లలో దెబ్బతిన్నాయి.

– డా.సుబ్బారావు, జిల్లా వ్యవసాయాధికారి

అప్పులే మిగిలాయి

నేను 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వేరుశనగ సాగు చేశాను. విత్తనాలతో పాటు అన్ని ఖర్చులు కలుపుకొని మొత్తంగా 1.50 లక్షలు ఖర్చు చేశాను. తీరా పంట చేతికొచ్చే సమయంలో వర్షానికి పంట పూర్తిగా తడిసిపోయింది. కాయలన్నీ మొలకలొచ్చాయి. కనీసం పెట్టుబడి కూడా రాలేదు. పంట కోసం చేసిన అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితి.

–కొంకా గాంధీ, రైతు, బత్తలపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
3,65,175 హెక్టార్లు జిల్లాలో సాగుభూమి విస్తీర్ణం1
1/3

3,65,175 హెక్టార్లు జిల్లాలో సాగుభూమి విస్తీర్ణం

3,65,175 హెక్టార్లు జిల్లాలో సాగుభూమి విస్తీర్ణం2
2/3

3,65,175 హెక్టార్లు జిల్లాలో సాగుభూమి విస్తీర్ణం

3,65,175 హెక్టార్లు జిల్లాలో సాగుభూమి విస్తీర్ణం3
3/3

3,65,175 హెక్టార్లు జిల్లాలో సాగుభూమి విస్తీర్ణం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement