స్వచ్ఛతపై అవగాహన కల్పించాలి
ప్రశాంతి నిలయం: స్వచ్ఛతతో పాటు వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ వాటర్ శానిటేషన్ మిషన్ జిల్లా స్థాయి కమిటీ తొలి సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లో జరిగింది. కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తామన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా పారిశుధ్య కార్యక్రమాలు పక్కాగా అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత జిల్లా స్థాయి కమిటీదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు, వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. జిల్లాకు 9,463 మరుగుదొడ్లు మంజూరయ్యాయన్నారు. డిసెంబర్ 5 నుంచి 9 వ తేదీ వరకు పరిశుభ్రమైన మరుగుదొడ్లను గుర్తించి అవార్డులు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎం.శంకరమ్మ, లక్ష్మీదేవి, సుకన్యకు మరుగుదొడ్ల మంజూరు లేఖలను కలెక్టర్ అందించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మల్లికార్జునప్ప, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీపీఓ సమత, జలవనరుల శాఖ జిల్లా అధికారి విజయ్ కుమార్‌రెడ్డి, వ్యవసాయ అధికారి సుబ్బారావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మంజువాణి, సీడీపీఓ గాయత్రిదేవి, టూరిజం అధికారి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
‘సూర్యఘర్’కు ఐదు మోడల్ గ్రామాలు
సౌరశక్తిని వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ‘సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకం అమలుకు జిల్లాలో ఐదు మోడల్ గ్రామాలను గుర్తించాలని కలెక్టర్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఎల్‌సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకం కింద ఇంటిపై సోలార్ ప్యానెళ్లు బిగించుకునే వారికి ప్రభుత్వం 40 శాతం వరకూ సబ్సిడీ ఇస్తుందన్నారు. పథకంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఓ కమిటీ వేస్తున్నామన్నారు. కమిటీ కన్వీనర్‌గా ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ సురేంద్ర వ్యహరిస్తారన్నారు. డీఎల్సీ కమిటీలో డీఆర్‌డీఏ పీడీ, డీపీఓ, స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లను సభ్యులుగా చేర్చుకోవాలని కన్వీనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో చురుకై న స్వయం సహాయక గ్రూప్‌లను గుర్తించి ‘సూర్యఘర్’పై వారికి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీపీఓ సమత, ఏపీ ఎస్పీడీసీఎల్ ఇంజినీర్లు మోషెస్, శివరామాంజినేయులు, చలపతి, అధికారులు కిషోర్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా
అధికారులతో కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment