ఆదిపత్యపోరుతో పల్లె పంచాయితీ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కూటమి నేతల ‘ఆది’పత్య పోరుతో ‘పల్లె’ పల్లెనా భూ వివాదాలు నెలకొన్నాయి. ‘కియా’ కార్ల కంపెనీ రాకను ముందుగానే పసిగట్టిన అప్పటి టీడీపీ నేతలు యర్రమంచి గ్రామ పరిసరాల్లో వందలాది ఎకరాల్లో భూములను తక్కువ ధరకే కొనుగోలు చేశారు. ఈ క్రమంలో అప్పడు మంత్రిగా ఉన్న టీడీపీ నేత బినామీల పేర్లతో వందల ఎకరాలు కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడా భూములపైనే వివాదం నెలకొంది. అప్పట్లో సదరు మంత్రికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న వ్యక్తితోనే ఇప్పుడు పంచాయితీ నడుస్తోంది.
మంత్రి సన్నిహితుడితో మాజీ మంత్రి పోరు..
యర్రమంచి వద్ద భూములు కొన్న మాజీ మంత్రి తాజాగా దౌర్జన్యానికి దిగడంతో వివాదం రేగింది. ప్రస్తుత మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తితో సదరు మాజీ మంత్రి కయ్యానికి కాలు దువ్వడం ఆసక్తి రేపుతోంది. పంతం నెగ్గాలనే ఉద్దేశంతో ఎవరికి వారు లేఖలు రాసుకోవడం, లోలోపల పంచాయితీలు చేసుకోవడం ఏళ్లుగా సాగుతోంది. ఫలితంగా భూ వివాదం తెగకపోవడంతో మధ్యలో వెళ్లే రోడ్డును మాజీ మంత్రి ఇటీవల ధ్వంసం చేయించారు. జేసీబీలతో రోడ్డును తవ్వేయడంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. ఆ మార్గం గుండా ‘కియా’కు అనుబంధంగా పనిచేసే ఓ కంపెనీ గోదాముకు వెళ్లాల్సి ఉండటంతో విషయం అమరావతి వరకూ చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీమంత్రి దౌర్జన్యంపై బాధితులు జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సదరు కంపెనీ యాజమాన్యం సీఎం చంద్రబాబుకు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు పంపించారు. అయితే కూటమి నేతల మధ్య పంతం ఏమాత్రమూ తగ్గలేదు.
వాటాల్లో తేడాతోనే..
‘కియా’ కార్ల కంపెనీ రాకతో అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఓ సీనియర్ నేత, మరో ముగ్గురు కలిసి సుమారు 250 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఎకరా సగటున రూ.20 లక్షల్లోపే ఉండేది. అందులో రోడ్డు పక్కనే ఉన్న భూమి, ఇతర భాగాలను పంచుకుని ఎవరికి వారుగా అగ్రిమెంట్లు చేసుకుని ఎకరా రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ ఎవరికి వారు విక్రయాలు చేశారు. అయితే రోడ్డుకు ఆనుకుని ఉన్న 70 ఎకరాలకుపైగా భూమి ఓ కూటమి నేత ఆధీనంలో ఉండటంతో మాజీ మంత్రి కన్నుపడింది. అందులోనూ తనకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. బేరం కుదరకపోవడంతో జేసీబీలతో దౌర్జన్యంగా రోడ్డు ధ్వంసం చేసినట్లు సమాచారం. అయితే సదరు వ్యక్తి జిల్లాకు చెందిన ప్రస్తుత మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండడంతో గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఇద్దరి మధ్య పంతంతో పక్కనే ఉన్న గోదాముకు వెళ్లేందుకు రోడ్డు లేకుండా పోయింది.
సీఎం వరకు పంచాయితీ..
వివాదం చెలరేగిన స్థలంలో నెలవారీ బాడుగ చెల్లిస్తూ ‘కియా’ అనుబంధ కంపెనీల గోదాములు ఏర్పాటు చేసుకున్నారు. అయితే కూటమి నేతల మధ్య భూ తగాదాలతో గోదాములకు వెళ్లే మార్గం లేకపోయింది. దీనిపై బాధితులు ఎస్పీ రత్నకు లేఖ రాశారు. అంతేకాకుండా సదరు కంపెనీ మేనేజర్ ద్వారా సీఎంఓ కు కూడా ఫిర్యాదు వెళ్లింది. నెల రోజుల నుంచి జిల్లా స్థాయిలో ఎన్ని పంచాయితీలు చేసినా సమస్య సద్దుమణగలేదు.
భూమి విలువ పెరగడంతో సమస్య..
కూటమి నేతలు కొన్న భూమిలో 170 ఎకరాలు చేతులు మారింది. మిగిలిన 80 ఎకరాల్లోనూ ఓ వ్యక్తి 20 ఎకరాలు విక్రయించాడు. ప్రస్తుతం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 50 ఎకరాలపై వివాదం నెలకొంది. అదంతా ఒకే వ్యకి ఆధీనంలో ఉండడంతో మిగతా వాటాదారులు తమకూ భాగం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఏకంగా రోడ్డును ధ్వంసం చేసి ఆ పొలంలోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అప్పటికే అక్కడ ‘కియా’ విడిభాగాల కోసం గోదాములు ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి నేతల పెద్దల వద్ద పంచాయితీ జరుగుతున్నట్లు సమాచారం.
‘కియా’ వద్ద భారీగా
భూములు కొన్న కూటమి నేతలు
పంపకాల్లో తేడాతో
ఏళ్లుగా నేతల మధ్య వివాదం
250 పైచిలుకు ఎకరాల్లో
వాటాల్లో తేడా
తాజాగా గోదాముకెళ్లే రోడ్డును జేసీబీతో ధ్వంసం చేసిన వైనం
వాహనాల రాకపోకలకు
తీవ్ర ఇబ్బందులు
Comments
Please login to add a commentAdd a comment