పుట్టపర్తి: సత్యసాయిబాబా జయంతిని పురస్కరించుకుని పుట్టపర్తి నియోజకవర్గంలోని పాఠశాలలకు ఈ నెల 23వ తేదీన ప్రత్యేకంగా సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈఓ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పుట్టపర్తి, బుక్కపట్నం, నల్లమాడ, కొత్తచెరువు మండలాల పరిధిలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు స్థానిక సెలవుగా ప్రకటించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
భార్యను హత్య చేసిన
భర్తకు జీవిత ఖైదు
అనంతపురం: అదనపుకట్నం కోసం వేధించి భార్యను హత్య చేసిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వివరాలు.. గుంతకల్లులోని అరవింద నగర్‌కు చెందిన బాలాజీనాయక్ కుమారుడు కే. సుబ్రమణ్యం నాయక్‌కు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం రాచువారిపల్లికి చెందిన అఖిలతో 2021లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో యువతి తల్లిదండ్రులు 10 తులాల బంగారు నగలు ఇచ్చారు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకే అదనపు కట్నం కోసం భార్యను సుబ్రమణ్యం నాయక్ వేధించడం ప్రారంభించాడు. రూ.10 లక్షలు, ఒకటిన్నర ఎకర పొలం తన పేరు మీద రాయించాలని సతాయించేవాడు. మరోవైపు అఖిలపై అనుమానం పెంచుకుని హింసించేవాడు. ఈ క్రమంలోనే 2022 మార్చి 31 రాత్రి 8:30 గంటల సమయంలో అఖిల తన తల్లికి ఫోన్ చేసింది. ‘నన్ను ఎక్కడెక్కడో తిప్పి ఇంటికి తీసుకొచ్చాడు. ఏం చేస్తాడో అనే భయం వేస్తోంది. రేపు ఉదయాన్నే ఊరికి వస్తా’ అని చెప్పింది. అయితే, ఆ తర్వాతి రోజే సుబ్రమణ్యం నాయక్ అఖిలను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గుంతకల్లు సీఐ నాగశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతపురం నాలుగో సెషన్స్ జడ్జి కోర్టు(మహిళా న్యాయస్థానం)లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టులో పీపీ సుజన 13 మంది సాక్షులను విచారించారు. నేరం రుజువు కావడంతో బుధవారం నాలుగో సెషన్స్ జడ్జి శోభారాణి తీర్పు వెలువరించారు. ముద్దాయి కే. సుబ్రమణ్యం నాయక్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధించారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచి, ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు మానిటరింగ్ సిస్టం సీఐ వెంకటేశ్, కోర్టు లైజన్ ఆఫీసర్ శ్రీనివాసులు, హెడ్‌కానిస్టేబుల్ సౌ రెడ్డి, కానిస్టేబుల్ నాగేంద్రయ్యను ఉన్నతాధికారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment