● మనుషులపై తీవ్ర దుష్ప్రభావం
● తెల్ల, ఎర్ర రక్త కణాల ఆవిరి
● క్యాన్సర్, అల్సర్‌లకు దారితీస్తున్న వైనం
● ప్లేట్‌లెట్స్ తగ్గిపోతున్నట్టు వైద్యుల హెచ్చరికలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పైర్లపై క్రిమి కీటకాలు దాడి చేస్తుంటే.. వాటిని చంపేందుకు వాడుతున్న పురుగు మందులు మనుషులపై దాడి చేస్తున్నాయి. ఏవైనా వ్యాధులు సోకినప్పుడు మనకు రక్షణ కవచంలా పనిచేసేది మూలకణాలే. ఎలాంటి రోగాలనైనా తిప్పికొట్టే సామర్థ్యం వీటికి ఉంటుంది. అలాంటి మూల కణాలపైనే పురుగు మందుల అవశేషాలు దాడి చేస్తున్నట్లు తేలింది. ఈ విషయం ప్రజలనే కాదు వైద్యులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
ఇప్పటికే రకరకాల వైరస్‌లు, బాక్టీరియాలు దొంగ దెబ్బ తీస్తుండగా... నేడు పురుగు మందుల అవశేషాలు కూడా కోలుకోలేని దెబ్బతీస్తున్నట్లు వెల్లడి కావడం గమనార్హం. ఇకపోతే మందుల అవశేషాల వల్ల శరీరానికి ప్రాణవాయువులా ఉండే తెల్లరక్తకణాలు, ఎర్రరక్తకణాలు, ప్లేట్‌లెట్స్ కూడా ప్రమాదానికి గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ మొదలు ఎప్లాస్టిక్ ఎనీమియా (బోన్‌మారో ఫెయిల్యూర్ సిండ్రోమ్) వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నట్లు వివరిస్తున్నారు.
తీవ్ర నీరసం..
ఎప్లాస్టిక్ ఎనీమియా వల్ల శరీరంలో ప్రధానంగా హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది. తెల్లరక్త కణాలు గణనీయంగా తగ్గుతాయి. ఇక ప్లేట్‌లెట్స్ కౌంట్ వందల్లోకి చేరుతుంది. దీంతో మనిషి రోజు రోజుకు నీరస పడిపోతాడు. ఆరోగ్యవంతుడికి హిమోగ్లోబిన్ 14 ఉండాలి. కానీ ఎప్లాస్టిక్ ఎనిమీయా బాధితుడికి 2 వరకు పడిపోతుంది. ప్లేట్‌లెట్స్ సాధారణంగా 1.50 లక్షల నుంచి 4 లక్షల పైన ఉండాలి. అలాంటిది వెయ్యికి కూడా పడిపోతాయి. దీనంతటికీ కారణం మూల కణాల్లోనుంచి ఉత్పత్తి కావాల్సిన తెల్లరక్త కణాలు, ఎర్రరక్త కణాలు, ప్లేట్‌లెట్స్ ఉత్పత్తి కాకపోవడమే. అంతేకాదు కొన్ని రకాల క్యాన్సర్‌లు, అల్సర్‌లు, చర్మానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులకు పురుగు మందుల అవశేషాలు కారణమని వైద్యులు చెబుతున్నారు.
విచ్చలవిడిగా వాడకం..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూరగాయలతో పాటు పండ్ల తోటల వ్యవసాయం ఎక్కువగా ఉంది. పురుగు మందు పిచికారీ చేస్తేగానీ పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో రైతులు విచ్చలవిడిగా పురుగు మందులు వాడుతుండటంతో ఆ అవశేషాలు మనిషి శరీరంలోకి వెళ్లి తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలో పురుగు మందుల అవశేషాల కారణంగా వస్తున్న జబ్బులను వైద్యులు వెల్లడిస్తున్నారు. దీర్ఘకాలిక జబ్బుల కారణంగా ఎక్కువమంది ప్రభావితమవుతున్నట్టు తేలింది. ముఖ్యంగా ఎప్లాస్టిక్ ఎనీమియా బారిన పడుతున్న వారు ఎక్కువవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment