జీవాల సంరక్షణ చర్యలు చేపట్టండి
అనంతపురం అగ్రికల్చర్: చలికాలంలో జీవాలకు సంక్రమించే జబ్బులు, వాటి సంరక్షణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెంపకందారులకు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జీపీ వెంకటస్వామి, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీడీఎల్) ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలు, రాత్రి, ఉదయం పూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్న నేపథ్యంలో గొర్రెలు మేకలు, వాటి పిల్లలకు వ్యాధులు సంక్రమించకుండా తీసుకోవాల్సిన చర్యలను వారు వివరించారు.
● చలిని తట్టుకునే శక్తి వచ్చే వరకూ తల్లి గొర్రె నుంచి పాలు అందేలా గొర్రె పిల్లలను చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల గొర్రె పిల్లల్లో ఎదుగుదల, వ్యాధి నిరోదకశక్తి పెరుగుతుంది. చిన్నవాటికి చలిగాలులు తగలకుండా, శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
● జీవాలు ఉండే ప్రాంతాల్లో భూమిలో తేమశాతం లేకుండా ఉండాలి. పొడి వాతావరణం, ఎత్తైన ప్రదేశాలను ఎంచుకోవాలి. లేదంటే తేమ వల్ల పరాన్నజీవులు, సూక్ష్మజీవుల బెడద ఎక్కువై వ్యాధులు ప్రబలి మరణాలు సంభవిస్తాయి.
● గొర్రె, మేక పిల్లలు మట్టిని నాకకుండా చూసుకోవాలి. లేకుంటే పారుడురోగం లాంటి వ్యాధులు సోకుతాయి. ఖనిజ లవణ మిశ్రమం (మినరల్ మిక్చర్) కలిగిన ఇటుకలను పిల్లల గూళ్లలో వేలాడదీయాలి. పిల్లలను ఎక్కువ సంఖ్యలో ఉంచితే ఒత్తిడి నెలకొంటోంది కాబట్టి విశాలంగా, శుభ్రంగా గాలి వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలి. రాత్రిళ్లు వెచ్చదనం ఉండేలా లైట్లను లేదంటే అడ్డుతెరలు ఏర్పాటు చేయాలి.
● చలికాలంలో ఈగలు, దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. గోమార్ల నివారణ చర్యలు చేపట్టాలి. చిన్న పిల్లలను బయట ప్రదేశాల్లో ఉంచితే దోమతెరలు వాడాలి. చిన్నపాటి షెడ్లలో పట్టలు కప్పి అందులో పెంచడం ఉత్తమం.
● జబ్బులు వ్యాపిస్తే మందలోని పిల్లలను వేరు చేయాలి. పిల్లలన్నింటీకీ ఎంసీ–ఈటీ టీకాను వేయించాలి. యాంటీబయోటిక్స్, బీ–కాంప్లెక్స్, లివర్ టానిక్‌లు, ఈస్ట్ కల్చర్‌లు, జీర్ణక్రియ మందులు, ఐరన్, క్యాల్షియం తదితర మందులు పశువైద్యుని సూచన మేరకు వాడాలి.
● ఇప్పటికే ముందస్తు జాగ్రత్త కింద 8.03 లక్షల జీవాలకు మూతిపుండ్ల, నీలినాలుక వ్యాది (బ్లూటంగ్) టీకాలు ఉచితంగా వేశారు. ఈ వ్యాధి సోకితే ఎక్కువగా జ్వరం, మూతివాపు, నోటిలో పుండ్లు, పెదవులు దద్దరించడం, ముక్కు నుంచి చీమిడి కారడం లాంటి లక్షణాలు ఉంటాయి. నివారణ చర్యలు చేపట్టకపోతే 30 శాతం వరకు మరణాలు ఉంటాయి. సాయంత్రం పూట గొర్రెల మందలో వేపాకు పొగ వేయడం, అపుడపుడు బ్యూటాక్స్ లేదా టిక్కెల్ లాంటి మందులు పిచికారీ చేయడం, పొడి ప్రాంతాల్లో మేపుకోవాలి. పశువైద్యున్ని సూచన మేరకు నివారణ చర్యలు చేపట్టాలి.
● కాలిగిట్టల మధ్య చీము చేరి చెడు వాసన రావడం, కుంటడం లాంటి లక్షణాలు ఉంటే కాలిపుండ్ల వ్యాధి (ఫుట్‌రాట్)గా గుర్తించి బురద ప్రాంతాల్లో మేపకుండా చూడాలి. నట్టల మందు తాపించాలి. కాలిపుండ్లు బాగా కడిగి పసుపు లేదా ఆయిట్‌మెంట్ రాసి మట్టి తగలకుండా రెండు రోజులు యాంటీబయాటిక్స్ ఇవ్వాలి.
పశుశాఖ జేడీ, ఏడీడీఎల్ ఏడీ సూచన
Comments
Please login to add a commentAdd a comment