జాతీయ స్థాయి పోటీలకు తురకలాపట్నం విద్యార్థి
రొద్దం: జాతీయ స్థాయి అండర్–17 సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో రొద్దం మండలం తురకలాపట్నంలోని జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి చరణ చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు ఆ పాఠశాల హెచ్‌ఎం శివరాం, పీఈటీ రామకృష్ణ మంగళవారం తెలిపారు. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన చరణ్... అద్భుత ప్రతిభతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో జనవరిలో మహారాష్ట్రలోని జలగావ్‌లో జరిగే జాతీయ స్థాయిలో పోటీలకు అర్హత సాధించిన చరణ్‌ను పాఠశాల ఉపాధ్యాయులు, సహ విద్యార్థులు అభినందించారు.
వ్యక్తిపై కట్టెతో దాడి
ధర్మవరం అర్బన్: వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై కట్టెతో దాడి చేసిన ఘటన ధర్మవరంలోని ప్రియాంకనగర్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని పీఆర్‌టీ వీధిలో ఉన్న సిల్క్ హౌస్ గుమస్తా సత్యదీప్... మంగళవారం రాత్రి ప్రియాంకనగర్‌లో వెళుతుండగా అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ కట్టెతో దాడి చేసి గాయపరిచాడు. స్వల్పగాయాలైన సత్యదీప్‌ను కాగా స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
ఉత్కంఠ భరితంగా
బధిరుల క్రికెట్ టోర్నీ
అనంతపురం: అనంత క్రీడాగ్రామంలోని ఆర్డీటీ స్టేడియం వేదికగా సాగుతున్న బధిరుల జాతీయ స్థాయి అండర్–19 క్రికెట్ టోర్నీ రెండో రోజు ఉత్కంఠగా సాగింది. డెఫ్ ఢిల్లీ, డెఫ్ ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం బరిలో దిగిన యూపీ జట్టు 15.5 ఓవర్లలోనే 169 పరుగులు చేసి విజయం సాధించింది. అలాగే డెఫ్ మధ్యప్రదేశ్, డెఫ్ హర్యానా మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డెఫ్ మధ్యప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. అనంతరం హర్యానా జట్టు 122 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును హర్యానాకు చెందిన విజయ్ అందుకున్నారు. డెఫ్ ఒడిశా, డెఫ్ ఏపీ జట్ల మధ్య ఏకపక్ష పోరు సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిశా జట్టు 133 పరుగులు సాధించింది. అనంతరం బరిలో దిగిన ఏపీ జట్టు 8.5 ఓవర్ల వద్ద 42 పరుగులకు కుప్పకూలింది. ఒడిశాకు చెందిన నితీస్ బెహారాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నీని ఐడీసీఏ సెక్రెటరీ అజయ్, స్పోర్ట్స్ అకాడమీ మేనేజర్ శ్రీదేవి, డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కె.గోపీనాథ్, సత్యనారాయణరెడ్డి, తదితరులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment