హక్కులు కాలరాస్తే సహించం
పుట్టపర్తి టౌన్: కార్మిక, కర్షక హక్కులను కాలరాస్తే సహించబోమంటూ కార్మికులు, రైతులు మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడుతూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో కదం తొక్కారు. గణేష్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకూ ఎర్రజెండాలతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు వేమయ్యయాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు బాలకాశి, తదితరులు మాట్లాడారు. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ సర్కార్ గతంలో రద్దు చేస్తామని చెప్పిన నల్లచట్టాలను మళ్లీ అమల్లోకి తీసుకావాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను లేబర్ కోడ్ పేరుతో నాలుగు చట్టాలు చేసి, పెట్టుబడిదారులకు కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేపట్టారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉవ్విళ్లూరుతున్నాయన్నారు.
చిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఔట్ సోర్శింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, రూ.26 వేల జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. చిరుద్యోగులపై కక్ష సాధింపు చర్యలు వీడకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్, నాయకులు మహదేవ్, ఇంతియాజ్, ఈఎస్ వెంకటేష్, పెద్దన్న, పైపల్లి గంగాధర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై
ధ్వజమెత్తిన కార్మికులు, కర్షకులు
Comments
Please login to add a commentAdd a comment