విలువల విద్యాలయం
ప్రశాంతి నిలయం: ప్రాచీన గురుకులు విద్యా విధానానికి మెరుగులు దిద్ది నేటి సమాజ అవసరాలకు అనుగుణంగా మానవతా విలువలు, భారతీయ సంస్కృతిని కలగలిపి తాను నెలకొల్పిన విద్యా సంస్థల ద్వారా చక్కటి విద్యాబోధనకు శ్రీకారం చుట్టారు సత్యసాయి. 1981 సంవత్సరంలో సత్యసాయి చాన్సలర్ హోదాలో సత్యసాయి యూనివర్సిటీని స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తోంది సత్యసాయి డీమ్డ్ టు బి యూనివర్సిటీ.
1986 శాశ్వత సభ్యత్వం
సత్యసాయి యూనివర్సిటీకి 1986లోనే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్‌లో శాశ్వత సభ్యత్వం లభించింది. సత్యసాయి విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఙానంతో కూడిన పాఠాలతో పాటు మానవతా విలువలు, భారతీయ సనాతన సంస్కృతిపై అవగాహన పెంపొందేలా విద్యను బోధిస్తున్నారు. సత్యసాయి డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా క్యాంపస్‌లను నిర్వహిస్తోంది. ప్రశాంతి నిలయం క్యాంపస్‌తో పాటు అనంతపురంలో మహిళా క్యాంపస్ ఉంది. అలాగే ముద్దనహళ్లి, బృందావన్ క్యాంపస్‌లు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. ఈ క్యాంపస్‌ల ద్వారా ఏడు విభాగాల్లో అండర్ గ్యాడ్యుయేషన్ (యూజీ), ఐదు విభాగాలలో పోస్ట్ గ్రాడ్యూయేషన్ (పీజీ), మూడు ప్రొఫెషనల్ కోర్సులు నిర్వహిస్తున్నారు. దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణలతో నడుపుతున్న యూనివర్సిటీగా కొనసాగుతున్న సత్యసాయి యూనివర్సిటీకి 2002లో నేషనల్ అసోసియేషన్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) ఏ++ గ్రేడును కేటాయిస్తూ జాతీయస్థాయి అత్యున్నత విద్యాసంస్థగా గుర్తించింది. ఆ తర్వాత 2008లో సత్యసాయి డీమ్డ్ టు బి యూనివర్సిటీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. సత్యసాయి విద్యాసంస్థల ద్వారా పరిశోధనా రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పరిశోధనా కేంద్రాన్ని స్థాపించారు. దేశంలోని అత్యున్నత వేదికలపై సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు అన్ని రంగాల్లో సత్తాచాటుతున్నారు. దేశ వ్యాప్తంగా సత్యసాయి యూనివర్సిటీకి అనుబంధంగా 99 విద్యాసంస్థలు పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నాయి.
స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
సత్యసాయి 99వ జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో సత్యసాయి యూనివర్సిటీ 43వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 9:50 గంటలకు స్నాతకోత్సవ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 10.03 నిమిషాలకు సత్యసాయి విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమవుతాయి. 10.06 నిమిషాలకు ఫౌండర్ చాన్సలర్ సత్యసాయి డిజిటల్ స్క్రీన్ ద్వారా స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తారు. 10.08కి వైస్ చాన్సలర్ ప్రారంభోపన్యాసం చేస్తారు. 10.32 గంటలకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తారు. 10.35కు ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్‌డీలు, పట్టాలను ముఖ్య అతిథి చేతులు మీదుగా పంపిణీ చేస్తారు. తర్వాత విద్యార్థులనుద్దేశించి స్నాతకోత్సవ సందేశాన్నిస్తారు. సత్యసాయి పూర్వపు ప్రసంగాలను డిజిటల్ స్క్రీన్‌లపై ప్రదర్శిస్తారు. 11.54 గంటలకు చాన్సలర్ స్నాతకోత్సవాన్ని ముగిస్తారు. సత్యసాయి విద్యాసంస్థల్లోని వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన 22 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 14 మందికి పరిశోధనా విద్యార్థులకు డాక్టరేట్లు, 480 మందికి పట్టాలను ముఖ్య అతిథి చేతుల మీదుగా పంపిణీ చేస్తారు. వేడుకలకు ముఖ్య అతిథి యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ సేతురామన్ పంచనాథన్ హాజరు కానున్నారు.
ఆదర్శంగా నిలిచిన సత్యసాయి విద్యాసంస్థలు
నేడు సత్యసాయి డీమ్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవం
22 మందికి బంగారు పతకాలు
14 మందికి డాక్టరేట్లు,
480 మందికి పట్టాల పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment