పత్తి నిల్వలు దగ్ధం
గుడిబండ: మల్బరీ షెడ్డులో నిల్వ చేసిన పత్తి దిగుబడులు ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. గుడిబండ మండలం తాళికెరలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సురేంద్ర తనకున్న రెండు ఎకరాల పొలంలో పత్తి పంటను సాగు చేశాడు. మార్కెట్‌లో ధర పెరిగిన తర్వాత పత్తిని విక్రయించాలనుకున్న ఆయన... తన పొలంలోనే నిర్మించిన మల్బరీ షెడ్డులో పత్తి నిల్వలను భద్రపరిచాడు. శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుని మంటలు చెలరేగడంతో పత్తితో పాటు మల్బరీ షెడ్డు కాలిపోయింది. దీంతో రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ కళ్యాణ్‌చక్రవర్తి, సెరికల్చర్ ఏడీ రాజు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
పశువుల తరలింపును
అడ్డుకున్న గో రక్షణ సమితి
నల్లచెరువు: తెలంగాణా నుంచి కేరళకు అక్రమంగా తరలిస్తున్న 29 పశువులను శుక్రవారం నల్లచెరువు సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద తమిళనాడు గో రక్షణ సమితి సభ్యుడు ఆర్.రఘురాం శర్మ అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ మక్బూల్‌బాషా తెలిపిన మేరకు... ఐచర్ వాహనంలో పశువులను తరలిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన రఘురాంశర్మ నల్లచెరువు వద్ద అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఐచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకొని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవులను అన్నమయ్య జిల్లా తంబాళ్లపల్లి గ్రామం వద్ద ఉన్న నవశక్తి పీఠం గోశాలకు తరలించారు.
నేటి నుంచి కొనకొండ్లలో
రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు
వజ్రకరూరు: రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్ 17 బాలుర సాఫ్ట్‌బాల్ పోటీలకు వజ్రకరూరులోని జెడ్పీహెచ్‌ఎస్ సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు హెచ్‌ఎం వేణుగోపాల్, పీఈటీలు సత్యనారాయణ, కళాసుధాకర్ వెల్లడించారు. పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం వారు పరిశీలించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment