నిందలు వేయకండి
పెనుకొండ రూరల్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీని అమలు చేయకపోయినా పర్వాలేదు కానీ, ప్రజలపై నిందలు వేయడం సరికాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శాసన మండలిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో డీబీటీల ద్వారా సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన ప్రజలు గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు అలువాటు పడ్డారంటూ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. పార్టీలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్ సీపీదేనని అన్నారు, అమ్మఒడి, చేయూత, మహిళా సంఘాల ద్వారా లబ్ది పొందిన మహిళలు, వసతి దీవెన, విద్యా దీవెన పథకాల లబ్ధి చేకూరిన విద్యార్థులు, కులవృత్తులపై ఆధారపడిన వారికి, వృత్తిలో స్థిరపడాలనుకున్న న్యాయవాదులకు పారదర్శకంగా సంక్షేమ ఫలాలను అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందజేశారన్నారు. మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు అప్పటి సంక్షేమ ఫలాల లబ్ధి పొందిన వారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. మద్యానికి ప్రజలను బానిసలను చేసే నైజం టీడీపీకే చెల్లుతుందన్నారు. ఇందుకు సోమందేపల్లిలో మంత్రి సవిత భర్త స్వయంగా మద్యం షాపులను ప్రారంభించిన అంశాలే అద్దం పడుతున్నాయన్నారు. గంజాయి, మద్యం పేరుతో రైతులు, విద్యార్థులే మహిళలు, వృద్ధులు, న్యాయవాదులను అవమానించే రీతిలో మాట్లాడి బీసీల పింఛన్‌లపై స్పష్టత ఇవ్వకుండా దాట వేయడం బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా ఉన్న సవితకే చెల్లుబాటవుతుందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వకపోయిన పర్వాలేదు కానీ, ప్రజలను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి బేషరత్తుగా వారందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషాశ్రీచరణ్
Comments
Please login to add a commentAdd a comment