ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
గుంతకల్లు రూరల్: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. వివరాలు... గుంతకల్లు మండలం నెలగొండ గ్రామానికి చెందిన గోవిందు, శకుంతల దంపతులకు కుమారుడు చరణ్ (14), ఓ కుమార్తె ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 9వ తరగతి చదువుతున్న చరణ్... శుక్రవారం తన స్నేహితులు ఈతకు వెళుతున్నారన్న విషయం తెలుసుకుని బడి ఎగ్గొట్టి వారితో పాటు సైకిల్‌పై గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్‌డ్యాం వద్దకు వెళ్లాడు. ఈత కొట్టేందుకు సిద్ధమవుతుండగా అక్కడే ఉన్న సమీప బంధువులైన గొర్రెల కాపరులు వారించారు. అయినా తనకు ఈత వస్తుందని బుకాయించాడు. వద్దని వాళ్లు గట్టిగా చెప్పడంతో చేసేదేమీ లేక చెక్‌డ్యాం వద్ద కూర్చొని కాళ్లు నీళ్లలో పెట్టి ఆడుకుంటూ కూర్చొన్నాడు. ఈ క్రమంలో బంధువుల దృష్టి ఏమార్చి నీళ్లలోకి దిగిన చరణ్ కాసేపు ఈత కొడుతూ లోతైన ప్రాంతానికి వెళ్లి నీట మునిగాడు. మిగిలిన పిల్లలు కేకలు వేయడంతో గొర్రెల కాపరులు నీటిలో దిగి గాలింపు చేపట్టినా చరణ్ జాడను పసిగట్టలేకపోయారు. దీంతో చుట్టుపక్కల పొలాల్లో పనుల్లో నిమగ్నమైన రైతుల సాయం తీసుకుని మరోసారి చెక్‌డ్యాంలోకి దిగి దాదాపు గంటన్నర సేపు గాలించిన అనంతరం చరణ్ మృతదేహాన్ని వెలికి తీశారు. అప్పటికే విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు భారీగా అక్కడకు చేరుకున్నారు. చరణ్ ప్రాణాలతో ఉన్నాడనే అనుమానంతో కుటుంబసభ్యులు గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చెక్‌డ్యామ్‌లో నీట మునిగి విద్యార్థి మృతి
Comments
Please login to add a commentAdd a comment