భద్రత కట్టుదిట్టం
పుట్టపర్తి టౌన్: సత్యసాయి జయంత్యుత్సవాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొననున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. శుక్రవారం ఆమె స్థానిక సాయిఆరామంలో బందోబస్తు విధుల్లో ఉంటున్న సిబ్బందితో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆరుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 48 మంది ఎస్‌ఐలు, 171 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 300 మంది కానిస్టేబుళ్లు, 26 మంది మహిళా పోలీసులు, 170 హోంగార్డులతోపాటు స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి లోపాలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. జయంత్యుత్సవాల్లో పాల్గొనే వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వర్తించాలన్నారు. పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. అందరూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించి వేడుకలను ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీలు విజయకుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్‌ఆర్‌బీ అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ఆర్‌ఆర్‌బీ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24, 25, 26, 27వ తేదీల్లో హుబ్లీ–కర్నూలు సిటీ (07315) మధ్య నడిచే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు హుబ్లీ జంక్షన్ నుంచి రాత్రి 8.15 గంటలకు బయలుదేరి కర్నూలు రైల్వేస్టేషన్‌కు మరుసటి రోజు ఉదయం 6.00 గంటలకు చేరుతుందని పేర్కొన్నారు. తిరిగి ఈ నెల 25, 26, 27, 28వ తేదీల్లో ఈ రైలు కర్నూలు రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 7.30 గంటలకు బయలుదేరి హుబ్లీ జంక్షన్‌కు సాయంత్రం 4,15 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైలు గదగ్, కొప్పల్, హాస్పేట్, తోర్నగల్, బళ్లారి, గుంతకల్లు, డోన్ మీదుగా రాకపోకలు సాగిస్తుందని వివరించారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అందుబాటులోకి
మెగా సప్లి హాల్‌టికెట్లు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ మెగా సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఈ నెల 23 నుంచి జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ మూడు, ఐదు, ఏడు సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మెగా సప్లిమెంటరీకి సంబంధించి మూడు, ఐదు సెమిస్టర్ అభ్యర్థులకు రెగ్యులర్ వారితో పాటు పరీక్షలు నిర్వహించనున్నారు.
మృత్యువులోనూ
వీడని బంధం
ముదిగుబ్బ: పెళ్లిలో ఏడడుగులు వేసినప్పటి నుంచి ఒకరికొకరు తోడుగా ఉంటూ బతుకు బండిని లాగుతూ వచ్చారు. రక్తసంబంధీకులు ఉన్నా.. ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కష్టంతోనే జీవనం సాగిస్తున్నారు. అలా సాగిపోతున్న వారి దాంపత్య జీవితంలోకి మలిదశలో మృత్యువు తొంగిచూసింది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. వివరాలు... ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లికి చెందిన గంగన్న (80), నరసమ్మ (74) దంపతులు శుక్రవారం రాత్రి ముదిగుబ్బ నుంచి స్వగ్రామానికి ఆటోలో చేరుకున్నారు. రోడ్డుకు అటు వైపు దిగిన వారు గ్రామంలోకి వెళ్లేందుకు రహదారిని దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొంది. ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. కాగా, వృద్ధ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పట్నం ఎస్‌ఐ రాజశేఖర్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment