ఉరవకొండ: అప్పులు తీర్చే మార్గం కానరాక ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ (51) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... తనకున్న 8 ఎకరాల పొలంలో గత రెండేళ్లుగా మిరప, వేరుశనగ, పప్పుశనగ తదితర పంటలను రైతు వెంకటేష్ సాగు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పంటల సాగుకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశాడు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టాలు చవిచూడడంతో అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో ఎలాగైనా రుణ విముక్తి పొందాలనుకున్న ఆయన... మరి కొంత అప్పు చేసి గొర్రెల పోషణ చేపట్టాడు. అయితే అనారోగ్యం కారణంగా 20 గొర్రెలు మృతి చెందాయి. పంటల సాగు, గొర్రెల పోషణకు చేసిన అప్పులు రూ.10 లక్షలకు చేరుకోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ కుటుంబసభ్యులతో చెప్పుకుని గురువారం బాధపడ్డాడు. అనంతరం అదే రోజు రాత్రి పొలం వద్ద ఉన్న జీవాల దొడ్డిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భోజనం తీసుకుని వెళ్లిన కుటుంబసభ్యులు గమనించి వెంటనే వెంకటేష్‌ను ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. కాగా, వెంకటేష్‌కు భార్య గంగమ్మ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment