నేడు సత్యసాయి జయంతి
● ఏర్పాట్లు పూర్తి చేసిన
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్
● సర్వాంగసుందరంగా ముస్తాబైన ప్రశాంతి నిలయం
● ముఖ్య అతిథిగా హాజరుకానున్న
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్
ప్రశాంతి నిలయం: ప్రేమ మూర్తిగా.. సేవా స్ఫూర్తిగా.. ఆధ్యాత్మిక చైతన్య దీప్తిగా భక్తుల మదిలో కొలువైన సత్యసాయి 99వ జయంతి వేడుకలకు ప్రశాంతి నిలయం ముస్తాబైంది. శనివారం సాయికుల్వంత్ సభా మందిరంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. సత్యసాయి సమాధిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. సాయికుల్వంత్ సభా మందిరాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేస్తున్నారు.
జయంతి వేడుకలు ఇలా ...
సత్యసాయి 99వ జయంతి వేడుకలు సాయికుల్వంత్ సభా మందిరంలో శనివారం ఉదయం 8 గంటలకు వేదపఠనంతో ప్రారంభమవుతాయి. 8.20 గంటలకు సత్యసాయి విద్యార్థులు గురువందనం కార్యక్రమం ఉంటుంది. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానంద ట్రస్ట్ వార్షిక నివేదికను వెల్లడిస్తారు. సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య ప్రసంగిస్తారు. ఆ తర్వాత ముఖ్య అతిథి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ భక్తులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ దివ్యాంగుల సేవ కోసం చేపట్టిన సత్యసాయి దివ్యాంగ్‌జన్ పథకం ద్వారా వికలాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేస్తారు. సత్యసాయి ‘ప్రేమతరు’ పేరుతో 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహణ ఉంటుంది. అలాగే సత్యసాయి పూర్వపు ప్రసంగాన్ని డిజిటల్ స్క్రీన్‌లపై ప్రదర్శిస్తారు.
సాయంత్రం స్వర్ణ రథోత్సవం
సాయంత్రం 5 గంటలకు ప్రశాంతి నిలయం పురవీధుల్లో సత్యసాయి బంగారు రథం ఊరేగింపు, సాయికుల్వంత్ సభా మందిరంలో జోలోత్సవం నిర్వహిస్తారు. అనంతరం లాల్ గుడి కృష్ణ, లాల్ గుడి విజయలక్ష్మి దంపతుల వయోలిన్ కచేరీ ఉంటుంది. ఆ తర్వాత మహా మంగళ హారతితో వేడుకలు ముగుస్తాయి.
గవర్నర్‌కు ఘన స్వాగతం
సత్యసాయి 99వ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం రాత్రి పుట్టపర్తి చేరుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయంలోని సాయి శ్రీనివాస అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు కలెక్టర్ టీఎస్ చేతన్, జేసీ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న ఘన స్వాగతం పలికారు. శనివారం సాయికుల్వంత్ సభా మందిరంలో జరిగే సత్యసాయి జయంత్యుత్సవాల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment