పాల సరఫరాలో అక్రమాలపై విచారణ
హిందూపురం టౌన్: అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాలల్లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఇన్‌చార్జ్ పీడీ వరలక్ష్మి శనివారం విచారణ చేపట్టారు. హిందూపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు మూడు నెలల నుంచి ఇండెంట్ ప్రకారం కాకుండా ప్రతి కేంద్రానికీ ఒక బాక్స్ చొప్పున తక్కువ అందజేస్తున్నారు. అనధికారికంగా పాలల్లో కోత విధించిన విషయం ఇన్‌చార్జ్ పీడీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. అనంతరం సీడీపీఓ కార్యాలయానికి చేరుకుని సీడీపీఓ, సూపర్‌వైజర్లు, కార్యకర్తలతో విచారణ చేపట్టారు. సీడీపీఓ చెప్పారంటూ సరఫరాదారు చెప్పి తమ కేంద్రాల నుంచి ఒక్కో బాక్సు తీసేసుకున్నాడని కార్యకర్తలు సమాధానమిచ్చారు. ఇండెంట్ ప్రకారం ఇవ్వకుండా పాలల్లో కోత విధిస్తున్నా సీడీపీఓ పట్టించుకోకుండా బిల్లు పెట్టడంపై ఇన్‌చార్జ్ పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాల సరఫరాదారుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఉత్సాహంగా
అంధుల అథ్లెటిక్స్ పోటీలు
అనంతపురం: అనంతపురం ఆర్డీటీ మైదానంలో అంధుల మూడవ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలను శనివారం అంధుల జాతీయ క్రీడా సంఘం కార్యదర్శి డేవిడ్ ప్రారంభించారు. అంధ క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారు డిసెంబర్ 13 నుంచి 17 వరకు గుజరాత్ రాష్ట్రం వడోదరలో జరిగే జాతీయస్థాయి అంధుల అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అంధుల క్రీడా సంఘం అధ్యక్షుడు కె.వెంకటరమణ, ఏపీ అంధుల క్రీడా సంఘం కార్యదర్శి ఆర్.రఘుకుమార్, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ, కోచ్ కె.సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment