పొత్తిళ్లలోని బిడ్డకు అమ్మ దూరం!
బత్తలపల్లి: కాన్పు నిమిత్తం ఆస్పత్రిలో చేరిన నిండు గర్భిణి.. బిడ్డకు జన్మనిచ్చి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇంకా కళ్లుకూడా తెరవని పసికందు మాతృప్రేమకు దూరమైంది. ఈ ఘటన శనివారం బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన సమాచారం మేరకు... బెళుగుప్పకు చెందిన ఆంజనేయులు భార్య శారద(27)కు నెలలు నిండడంతో కాన్పు నిమిత్తం ఈనెల 20వ తేదీన ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకువచ్చి అడ్మిట్ చేశారు. శనివారం శారదకు ప్రసవ నొప్పులు రావడంతో వైద్యులు కాన్పుల వార్డుకు తీసుకువెళ్లారు. అయితే నార్మల్ డెలివరీ కావాలంటే కొద్దిసేపు నడవాలని సూచించారు. నొప్పులు తట్టుకోలేని శారద తనకు సిజేరియన్ చేయాలని కోరింది. అయినా వైద్యులు సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తీవ్ర ఆందోళనకు గురైన శారద మగబిడ్డకు జన్మనిచ్చి గుండెపోటుతో మృతి చెందింది. తొలుత బిడ్డను కుటుంబీకులకు చూపిన వైద్యులు... శారద ఆరోగ్యం బాగోలేదని...చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఆమె మృతి చెందిందని తెలిపారని శారద భర్త ఆంజనేయులు కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం రాత్రి శారద మృతదేహాన్ని బెళుగుప్పకు తరలించారు.
బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందిన గర్భిణి
Comments
Please login to add a commentAdd a comment