ఎనీ టైం మద్యం
కూటమి సర్కారు కొలువుదీరాక మద్యం ఏరులై పారుతోంది. లైసెన్సుడ్ దుకాణాల్లోనే కాదు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసిన బెల్టుషాపుల్లో విచ్చలవిడిగా మద్యం లభిస్తోంది. 24 గంటలూ ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు అమ్ముతూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు.
హిందూపురం: కూటమి పార్టీల కార్యకర్తలకు బెల్టుషాపులు ఆదాయ వనరులుగా మారాయి. అనధికారిక మద్యం అమ్మకాలలో దూసుకుపోతున్నారు. బెల్టుషాపుల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నూతన మద్యం పాలసీ తీసుకురావటం ద్వారా మద్యం విచ్చలవిడి అమ్మకాలు చేపట్టకుండా నియంత్రించింది. నేడు టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ప్రభుత్వ టెండర్లలో మద్యంషాపులు దక్కించుకున్న వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో పట్టణ శివార్లు, గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు వెలిశాయి. పైగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. జిల్లాలో 87 మద్యం షాపులు లైసెన్స్ పొందగా.. బెల్టుషాపులు 800కుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే పట్టణ పరిధిలో వార్డుకు ఒకటి, మండల పరిధిలో గ్రామానికి ఒకటి లేదా రెండు చొప్పున బెల్టుషాపులు వెలిశాయన్నమాట. బెల్టుషాపుల్లో అదనపు సౌకర్యాలు కల్పిస్తూ బార్లను మరిపిస్తున్నారు. దీంతో మందుబాబులు అక్కడే తాగి, తూగుతూ మత్తులోకి జారుకుంటున్నారు.
బహిరంగ ప్రదేశాల్లోనే మద్యపానం
ప్రభుత్వం నుంచి లైసెన్సు పొందిన మద్యం వ్యాపారులు సిండికేట్ రింగులోకి బెల్టు షాపులను తీసుకురావటంతో కుటీర పరిశ్రమగా మారిపోయింది. మద్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. మందుబాబులు బహిరంగ ప్రదేశాలలో సేవించి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదనే నిబంధనను పూర్తిగా గాలికి వదిలేశారు. బెల్టుషాపుల రద్దుపై మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కేశారు.
బెల్టుషాపుల్లో విచ్చలవిడిగా అమ్మకాలు
సౌకర్యాలతో బార్లను మరిపిస్తున్న వైనం
అధిక ధరల వసూలుతో బాదుడే బాదుడు
Comments
Please login to add a commentAdd a comment