అశ్రునయనాలతో అంత్యక్రియలు
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
పుట్లూరు : మృతుల కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించి ఆదుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగన్న, నాగమ్మ, కొండమ్మ, ఈశ్వరయ్య, బాల పెద్దయ్య, రామాంజినమ్మ, నాగమ్మ, జయరాముడు కుటుంబాలకు ఆదివారం రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వ సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించడం బాధాకరమన్నారు. ఎంత చేసినా కష్టాన్ని తీర్చలేమని, ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబీకులకు సూచించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇంటి పెద్దలను కోల్పోయామంటూ మంత్రి వద్ద కన్నీరుమున్నీరయ్యారు. కార్యక్రమంలో కలెక్టర్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎస్పీ జగదీష్, ఆర్డీఓ కేశవనాయుడు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం
అనంతపురం మెడికల్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. నగరంలోని కిమ్స్–సవీరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిని ఆదివారం మంత్రి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ ప్రమాదం విషయం తెలియగానే మృతులు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించామన్నారు. కలెక్టర్ వినోద్ కుమార్ క్షతగాత్రులను కిమ్స్–సవీరకు తరలించి మెరుగైన వైద్యం అందించేలా చూడటంతో ప్రాణాలు నిలబడ్డాయన్నారు. బాధిత పిల్లల చదువులకు సాయం అందించడంతో పాటు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రమాదాల కట్టడికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
● క్షతగాత్రులను మంత్రి టీజీ భరత్ కూడా పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
పుట్లూరు: ‘దేవుడా మమ్మల్ని అనాథలను చేశావు కదయ్యా... అమ్మానాన్నలు లేకుండా ఎలా బతకాలి’ అంటూ ఆ పిల్లలు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ‘స్వామీ.. ఇక నాకు దిక్కెవరయ్యా’ అంటూ ఓ ఇల్లాలు గుండెలవిసేలా విలపిస్తుంటే ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లి క్రాస్ వద్ద శనివారం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన ఎనిమిది మంది అంత్యక్రియలు ఆదివారం పుట్లూరు మండలంలోని ఎల్లుట్ల గ్రామంలో నిర్వహించారు. మృతదేహాలను శ్మశాన వాటికకు తీసుకెళ్తున్న సమయంలో కుటుంబసభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. నిత్యం తమ మధ్య ఉన్న వారు మరణించడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. మృతులతో తమ అనుబంధం గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నా రు. అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు.
పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు..
వైఎస్సార్‌సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ శింగనమల సమన్వయకర్త వీరాంజనేయులు, ఎంపీపీ రాఘవరెడ్డి తదితరులు ఎనిమిది మంది మృతదేహాలకు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అంత్యక్రియల కోసం రూ.10 వేల చొప్పున అందజేశారు. బాధపడరాదని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
● మృతుల కుటుంబాలను ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. తగిన విధంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment