సమస్యను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలి
ప్రశాంతి నిలయం: ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి సోమవారం గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో నిర్వహిస్తున్నాం. కానీ ఎందుకనో చిన్న చిన్న విషయాలకూ ప్రజలు కలెక్టరేట్ వరకూ వస్తున్నారు. ఇక నుంచి అలా జరగకూడదు. సమస్యలకు గ్రామస్థాయిలోనే పరిష్కారం చూపాలి. అక్కడ సాధ్యం కానివి మాత్రమే కలెక్టరేట్ వరకూ రావాలి. అందుకు అధికారులంతా చిత్తశుద్ధితో కృషి చేయాలి’’ అని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 246 అర్జీలు అందగా, వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ చేతన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల నుంచి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి పడేలా పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బయోమెట్రిక్ హాజరు అమలుపై ఆయా శాఖల అధిపతులు దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, ఎస్‌డీసీ సూర్యనారాయణరెడ్డి, సీపీఓ విజయ్‌కుమార్, వ్యవసాయ శాఖ అధికారి వైవీ సుబ్బారావు, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పద్మమ్మ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సంజీవయ్య, కదిరి ఆర్డీఓ వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నిర్మలాజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
భూ సమస్యలపై దృష్టి సారించాలి
రెవెన్యూ అధికారులు భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం ఆయన జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలిసి కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో భూ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని, అత్యధికంగా పెనుకొండ డివిజన్ నుంచి వస్తున్నాయన్నారు. అర్థిక పరమైన, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని తప్పించి మిగతా వాటన్నింటికీ పరిష్కారం చూపాలన్నారు. ఏదైనా అర్జీకి పరిష్కారం చూపకుండానే సమస్య పరిష్కారమైనట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసినా, సంబంధం లేని సమాధానాలు ఇచ్చినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సేవలు పౌరుల ముంగిళ్లలో అందించాలి..
ప్రభుత్వ సేవలను పౌరుల ఇళ్ల ముంగిళ్లలోనే అందించాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. ఇదే లక్ష్యంతో కేంద్రం ‘ప్రశాసన్ గావ్ కి ఒరే’ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గ్రామాల వైపు పరిపాలన –2024’ అంశంపై సమీక్షించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారం, సేవలు మెరుగుర్చడం కోసం కేంద్రం దేశవ్యాప్తంగా డిసెంబర్ 19 నుంచి 24వ తేదీ వరకు ‘ప్రశాసన్ గావ్ కి ఒరే’ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
‘పరిష్కార వేదిక’లో అందే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
అధికారులకు కలెక్టర్
టీఎస్ చేతన్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment