నిఘా పటిష్టం చేయాలి
● ముందస్తు చర్యలతో శాంతిభద్రతలను
పరిరక్షించాలి
● గోరంట్ల పోలీసులకు ఎస్పీ రత్న ఆదేశం
గోరంట్ల: గ్రామాల్లో నిఘా పటిష్టం చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్న ఆదేశించారు. సోమవారం ఆమె గోరంట్ల అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పోలీసు స్టేషన్ పరిసరాలతో పాటు రిసెప్షన్ కౌంటరు, కంప్యూటర్ గదిని పరిశీలించారు. కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, దర్యాప్తు, సిబ్బంది పనితీరు గురించి సీఐ బోయ శేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. చోరీల నియంత్రణకు రాత్రి వేళల్లో గస్తీలు ముమ్మరం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఐని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. విలేజ్ పోలీసు అధికారులు ఆయా గ్రామాల్లోని సమస్యాత్మక వ్యక్తచులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. అంతకుముందు పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐ శేఖర్ తన సిబ్బందితో కలిసి పాలసముద్రం సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు.
‘ఓపెన్’ పరీక్ష ఫీజు చెల్లించండి
పుట్టపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు డిసెంబర్ 31వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ కృష్టప్ప సూచించారు. ఆ తర్వాత అపరాధ రుసుంతో జనవరి 10వ తేదీ వరకూ ఫీజు చెల్లించవచ్చన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 23 నుంచి 31వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు. జనవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రూ.25, 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రూ.50 మేర అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. జనవరి 9, 10వ తేదీల్లో ఫీజు చెల్లించే ఇంటర్ విద్యార్థులు రూ.1,000, పదో తరగతి విద్యార్థులు రూ.500 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. పరీక్ష ఫీజు, ఇతర వివరాలకు www.apopen school.ap.gov.in వెబ్‌సైట్ చూడాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment