మంత్రి సత్యకుమార్‌పైనే ఆశలు
ధర్మవరం అర్బన్: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ధర్మవరం పట్టణంతోపాటు ధర్మవరం మండలం, రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, కొత్తచెరువు, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల నుంచి రోగులు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులు ధర్మవరం ఆసుపత్రికి వస్తుంటారు. కానీ ప్రస్తుతం ఆస్పత్రి నిర్వహిస్తున్న భవనం శిథిలావస్థ చేరి పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో వైద్యులు, సిబ్బందితోపాటు రోగులు భయాందోళన చెందుతున్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో అప్‌గ్రేడ్
ధర్మవరం నియోజకవర్గంతో పాటు ఇటు రాప్తాడు నియోజకవర్గ వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో 50 పడకలుగా ఉన్న ధర్మవరం ఏరియా ఆస్పత్రిని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రి కొనసాగుతున్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఏరియా ఆస్పత్రిని దుర్గానగర్ సమీపంలో నూతనంగా నిర్మించిన మాతాశిశు ఆస్పత్రి భవనాల్లోకి తరలించారు. శిథిలావస్థలో ఉన్న ఏరియా ఆస్పత్రి పాత భవనాన్ని తొలగించి 100 పడకలతో అధునాతనంగా నిర్మించేందుకు గత ఏడాది ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. అయితే ఆ తర్వాత ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ఆ ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు.
ధర్మవరం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తన నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిపై ఇప్పటికై నా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. శిథిలావస్థ భవనంలో కొనసాగుతున్న ఆస్పత్రిని మరోచోటకు మార్చి...వెంటనే నూతన భవనాలు నిర్మించాలని కోరుతున్నారు.
భవనం మార్పుతో
అష్టకష్టాలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సత్యకుమార్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ధర్మవరం ఆస్పత్రికి మహర్దశ పడుతుందని అందరూ భావించారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. మాతాశిశు ఆస్పత్రి భవనాల్లో నిర్వహిస్తున్న ఏరియా ఆస్పత్రిని కూటమి సర్కార్...మళ్లీ గతంలో ఉన్న శిథిల భవనానికి తరలించింది. ప్రస్తుతం ఆ భవనంలోనే ఆస్పత్రి కొనసాగుతోంది. పైకప్పులు ఊడిపడుతుండటంతో రోగులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తలుపులు, కిటికీలు, బాత్‌రూం డోర్లు విరిగిపోయాయి. వర్షం వస్తే ఆస్పత్రి మొత్తం కారుతోంది. మరుగుదొడ్ల డోర్లు విరిగిపోవడంతో కర్టెన్‌లు ఏర్పాటు చేశారు. మహిళలు బాత్‌రూం వెళ్లిన సమయంలో అక్కడ వారి బంధువులు కాపలాగా ఉండాల్సిన దుస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment