టీడీపీ నాయకుడిపై కేసు
పుట్టపర్తి టౌన్: సుగాలీలను కులంపేరుతో దుర్భాషలాడిన ప్రశాంతి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జెల వెంకటరాముడుపై పుట్టపర్తి అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... బీడుపల్లి తండా, బ్రాహ్మణపల్లి తండా, ప్రశాంతి గ్రామం వద్ద ఉన్న తండా వాసులు పని నిమిత్తం నిత్యం పుట్టపర్తి సమీపంలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్దకు వస్తుంటారు. ఆస్పత్రి సమీపంలోనే తిష్టవేసే టీడీపీ నాయకుడు, ప్రశాంతి గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారి గజ్జల వెంకటరాముడు కొన్ని రోజులుగా సుగాలీలను కులం పేరుతో దూషించే వాడు. అలాగే ఎయిర్ పోర్టు ఎదురుగా ఉన్న మూడు సెంట్ల ప్రభుత్వ భూమిని, కరెంట్ ఆఫీస్ వద్ద పడమటి భాగంలో ఉన్న 25 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. ఇలా... గజ్జల వెంకటరాముడు చాలా కాలం నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాదాగిరి చేస్తున్నాడు. ఆయన ప్రవర్తనతో విసిగిపోయిన సుగాలీలు...సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా మాట్లాడుతున్న వెంకటరాముడుపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఎస్పీ రత్న ఆదేశాలతో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ మంగళవారం విచారణ జరిపారు. అనంతరం డీఎస్పీ ఆదేశాలతో పుట్టపర్తి అర్బన్ పోలీసులు గజ్జెల వెంకటరాముడుపై కేసు నమోదు చేశారు.
‘పది’లో సత్తా చాటాలి
● విద్యార్థులకు డీఈఓ కృష్ణప్ప సూచన
ధర్మవరం రూరల్: జీవితంలో పదో తరగతి చాలా కీలకమైనదని, అందువల్ల పబ్లిక్ పరీక్షలకు బాగా సంసిద్ధులై మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్ప విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఆయన ధర్మవరం పట్టణంలోని పలు పాఠశాలలో పాటు ఉప్పునేసినపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలోని రికార్డులను, మధ్యాహ్న భోజనాన్ని పథకం అమలును ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. పదో తరగతిలో వచ్చే మార్కులు చాలా కీలకమన్నారు. ఉపాధ్యాయులు కూడా పదో తరగతిలో మెరుగైన ఉత్తీర్ణత కోసం కృషి చేయాలన్నారు. అనంతరం పాఠశాల నిర్వహణ, చదువుపై ప్రగతి తదితర వాటిపై ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకున్నారు. డీఈఓ వెంట ప్రధానోపాధ్యాయులు లింగారెడ్డి, శైలజ, రాంప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment