ఎండుమిర్చి క్వింటా రూ.16,500
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. మంగళవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 137 మంది రైతులు 161 క్వింటాళ్ల మిర్చి తీసుకురాగా, ఈ–నామ్ పద్ధతిలో వేలం పాటలు నిర్వహించినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. అందులో మొదటి రకం ఎండు మిర్చి క్వింటా రూ.16,500, రెండో రకం ఎండు మిర్చి క్వింటా రూ.9 వేలు, మూడో రకం క్వింటా ఎండుమిర్చి రూ.7 వేలు పలికాయి.
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు అనంతపురంలోని జెడ్పీ కార్యాలయ సమావేశ ప్రధాన మందిరం సహా అదనపు భవన్‌లో బుధవారం నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య మంగళవారం తెలిపారు. స్థాయీ సంఘం–1, 2, 4, 7(ఆర్థిక, ప్రణాళిక/గ్రామీణాభివృద్ధి/విద్య, వైద్యం/ఇంజినీరింగ్ శాఖలు) సమావేశాలు జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన ప్రధాన మందిరంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. స్థాయీ సంఘం–3, 5, 6(వ్యవసాయం/ఐసీడీఎస్/సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు అదనపు భవన్‌లో ఆయా సంఘ అధ్యక్షుల అధ్యక్షతన నిర్వహించనున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులు సమగ్ర వివరాలతో సమావేశాలకు హాజరుకావాలని స్పష్టం చేశారు.
కదిరిలో నకిలీనోట్ల కలకలం
● పొట్టేళ్లు కొని నకిలీ నోట్లిచ్చిన కేటుగాళ్లు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత రైతు
కదిరి అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో కొందరు కేటుగాళ్లు రైతు నుంచి పొట్టేళ్లు కొనుగోలు చేసి నకిలీ కరెన్సీ నోట్లు అంటగట్టారు. అవి నకిలీ నోట్లని ఆలస్యంగా తెలుసుకున్న రైతు.. కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ముదిగుబ్బ మండలానికి చెందిన రైతు నగేష్ తన పొట్టేళ్లు అమ్ముకునేందుకు మంగళవారం కదిరి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు వచ్చారు. ఇద్దరు యువకులు బేరమాడి నగేష్ వద్ద ఉన్న ఒక్కో పొట్టేలు రూ.16,250 చొప్పున రెండూ కలిపి రూ.32,500కు కొనుగోలు చేశారు. అనంతరం ఆయనకు డబ్బులిచ్చి పొట్టేళ్లు తీసుకువెళ్లారు. అనంతరం రైతు నగేష్ కదిరిలోని తన బంధువు వద్దకు వెళ్లి డబ్బు అతనికి ఇచ్చాడు. అయితే అవి నకిలీ నోట్లని గుర్తించిన అతను అదే విషయాన్ని రైతు నగేష్‌కు చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించి నగేష్ వెంటనే కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు మార్కెట్‌యార్డ్‌లోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. దుండగులు మాస్క్‌లు ధరించి కనిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కులగణనపై అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగింపు
ప్రశాంతి నిలయం: ఎస్సీ కులగణనపై అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 12వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓ నంబర్ 265 విడుదల చేసినట్లు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. కులగణనపై వచ్చే అభ్యంతరాలను జనవరి 12వ తేదీ వరకు నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి స్వీకరిస్తారన్నారు. వాటిని జనవరి 16వ తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారన్నారు. అన్ని తనిఖీలు పూర్తి చేసి తుది కులగణన సర్వే వివరాలను జనవరి 20వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల వద్ద విడుదల చేస్తారని వెల్లడించారు. మండల ప్రత్యేక అధికారులు సంబంధిత ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment