నేడు జిల్లాకు మంత్రి నారా లోకేష్
పుట్టపర్తి టౌన్: రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం జిల్లాకు విచ్చేస్తున్నారు. సాయంత్రం 4.15 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కొత్తచెరువు, ధర్మవరం మీదుగా అనంతపురం వెళ్లనున్నారు. అక్కడ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో బుధవారం ఎస్పీ రత్న అధికారులతో కలిసి విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ సీఐలు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, బొజ్జప్ప ఉన్నారు.
‘పురం’లో నియంత పాలన సాగుతోందా?
● ఎమ్మెల్యే బాలయ్య పీఏ శ్రీనివాసులు
ఆగడాలు శ్రుతిమించాయి
● మునిసిపల్ కాంట్రాక్టర్ ఆవేదన
హిందూపురం: హిందూపురంలో నియంత పాలన సాగుతోందా అని మునిసిపల్ కాంట్రాక్టర్ గోవర్ధన్‌బాబు ప్రశ్నించారు. ఆయన బుధవారం హిందూపురం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. తనకు పనుల కాంట్రాక్టు దక్కిందని, వాటిని చేయడానికి అధికారుల అనుమతి కోరితే ముందు ఎమ్మెల్యే ఆఫీసుకు వెళ్లి కలవాలని అంటున్నారని చెప్పారు. అక్కడికెళితే ఎమ్మెల్యే పీఏ శ్రీనివాసులు ‘నీవెవరు కాంట్రాక్ట్ చేయడానికి’ అంటూ దౌర్జన్యం చేశాడన్నారు. అతని అనుచరులు తనను బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లను నేరుగా బెదిరిస్తున్నారని, అస్మదీయులకే పనులన్నీ కట్టబెడుతున్నారని వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెబుతున్న మాటలకు.. హిందూపురంలో జరుగుతున్న పాలనకు పొంతనే లేదన్నారు. తాను రూ.5 లక్షల విలువైన మొక్కల సరఫరా, రూ.16 లక్షలతో 85 చెత్త బండ్ల సరఫరా టెండర్లను ఆన్‌లైన్ ద్వారా దక్కించుకున్నానన్నారు. వీటిలో ముందుకు వెళ్లడానికి అధికారులు సహకరించడం లేదని, ఎమ్మెల్యే పీఏలు దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. న్యాయబద్ధంగా టెండర్లు వస్తే పనులు చేయకుండా అడ్డుకోవడానికి ఎమ్మెల్యేల పీఏల అజమాయిషీ ఏమిటని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment